నానీ గారు.. మాట నిలుపుకోండి!
‘‘సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోండి నానీ గారు.. మీరు అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లో నష్ట పరిహారం చెల్లిస్తామని ఇచ్చిన హామీని నెరవేర్చండి.. మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడిచినా హామీ ఊసే ఎత్తడం లేదు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో అప్పటి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి చొరవ తీసుకుని రాయలచెరువు ముంపు రైతులను గుర్తించారు. పూర్తి వివరాలతో పరిహారం అందించేలా ఫైళ్లను సిద్ధం చేయించారు. ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో ఆ ఫైళ్లను పక్కనపెట్టారు. ఇప్పటికై నా మీరు స్పందించి తక్షణమే రైతులకు నష్ట పరిహారం చెల్లించి ఆదుకోండి’’ అంటూ వైఎస్సార్‌సీపీ చంద్రగిరి నియోజకవర్గం సమన్వయకర్త చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి స్పష్టం చేశారు.
రామచంద్రాపురం : మండంలోని రాయలచెరువుకు చేరుతున్న వరద నీటితోపాటు కరకట్టలను వైఎస్సార్‌సీపీ చంద్రగిరి నియోజకవర్గ సమన్వయకర్త చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి బుధవారం పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ చెరువు లీకేజీలను వెంటనే అరికట్టాలని డిమాండ్ చేశారు. లేకుంటే పలు గ్రామాలు ముంపునకు గురయ్యే ప్రమాదముందని హెచ్చరించారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో వరదలు వచ్చినపుడు రాయలచెరువు కట్టకు గండిపడితే అప్పటి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి వారం పాటు కట్టపై బస చేసి గండిని పూడ్చేంత వరకు ఇంటికి తిరిగిరాలేదని గుర్తు చేశారు. సుమారు లక్ష ఇసుక బస్తాలను కట్టకు అడ్డుగా వేసి గండిని పూడ్పించారని వెల్లడించారు. గండి పూడ్చే క్రమంలో కట్ట తెగితే దిగువ గ్రామాలన్నీ జలమయమవుతాయని, ముందుచూపుతో అందరినీ పునరావాస కేంద్రాలకు తరలించి ఆదుకున్నారని వివరించారు. ప్రాణాలకు తెగించి చెరువుకట్ట గండిని పూడ్పించిన ఘనత చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డికే దక్కుతుందన్నారు. వరదల సమయంలో మనుషులకే కాదు పశువులకు సైతం ఉచితంగా దాణా అందించిన చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఆపద్భాందవునిలా సేవలందించారని తెలిపారు.
చెరువు నుంచి లీకవుతున్న నీరు ప్రజల అవసరాలు తీర్చడానికే ..
రాయలచెరువు నిండి చుట్టుపక్కల గ్రామాలు నీట మునిగిన సమయంలో ప్రజల అవసరాలు తీర్చడానికే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి హెలికాప్టర్ వినియోగించాలని మోహిత్‌రెడ్డి స్పష్టం చేశారు. తుపాను సమయంలో మోకాటిలోతు నీటిలో నడుచుకుంటూ వెళ్లి బాధితులకు కేజీ బియ్యం కూడా ఇవ్వకుండా, దండంపెట్టి తిరిగిరావడం తమకు తెలియదని ఎమ్మెల్యే పులివర్తి నాని వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. చేతనైనంత వరకు ప్రజలకు సాయం చేశామన్నారు. అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు సాయం చేయాలే కానీ, గతంలో సాయం చేసిన వారిపై విమర్శలు గుప్పించడం సబబు కాదని హితవు పలికారు. ముందుగా ఎమ్మెల్యే నాని ఇచ్చిన మాట నిలబెట్టుకుని, రైతులకు పరిహారం ఇప్పించి తర్వాత మాట్లాడాలని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ బ్రహ్మానందరెడ్డి, వైస్ ఎంపీపీ లావణ్య చంద్రబాబు, వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షుడు ఎద్దుల చంద్రశేఖర్ రెడ్డి, నేతలు భానుకుమార్‌రెడ్డి, గిరిధర్‌రెడ్డి, రఘునాథరెడ్డి, భాస్కర్ రెడ్డి, కుప్పం భాస్కర్ యాదవ్, యశ్వంత్‌రెడ్డి, గోపీచౌదరి వెంకటేష్, పవన్ కుమార్ రెడ్డి, మారయ్య, బాదూరు భాస్కర్‌రెడ్డి, భాస్కరయ్య, టెండూల్కర్, రామిరెడ్డి, శంకర్‌రెడ్డి, శశి, పుష్ప కాంత్‌రెడ్డి, హిమాల్‌రెడ్డి పాల్గొన్నారు.


