‘పరకామణి’ కేసులో టీడీపీ నేత కోడూరును విచారించాలి
తిరుపతి మంగళం: టీటీడీ పరకామణిలో అవకతవకలకు పాల్పడిన రవికుమార్ ఆస్తులకు సంబంధించి టీడీపీ రాష్ట్ర నాయకుడు కోడూరు బాలసుబ్రమణ్యం వద్ద పూర్తి సమాచారం ఉన్నట్లుందని వైఎస్సార్‌సీపీ చిత్తూరు, తిరుపతి జిల్లాల అధికార ప్రతినిధి వాసుయాదవ్ చెప్పారు. అందువల్ల పరకామణి కేసులో సీఐడీ ఆయనను విచారించాలని కోరారు. తిరుపతి పద్మావతీపురంలోని వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యాలయంలో మంగళవారం వాసుయాదవ్ మీడియాతో మాట్లాడారు. టీటీడీలో జరుగుతున్న అపచారాలు, చైర్మన్ నియంత నిర్ణయాలను.. నిత్యం టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి ఎత్తిచూపడాన్ని బాలసుబ్రమణ్యం జీర్ణించుకోలేకపోతున్నారని విమర్శించారు. అందువల్లే టీటీడీపై అనవసర వ్యాఖ్యలు శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నాయంటూ ఫేస్‌బుక్‌లో పోస్టులు పెట్టారన్నారు. శ్రీవారి పరకామణిలో రూ.200 కోట్ల అవినీతి జరిగిందని, అందులో రూ.100 కోట్ల ఆస్తి కరుణాకరరెడ్డి రాయించుకున్నారంటూ మరో పోస్టు పెట్టారని చెప్పారు. రవికుమార్ వద్ద నుంచి భూమన కరుణాకరరెడ్డి రాయించుకుంటే బాలసుబ్రమణ్యం సాక్షి సంతకం చేశారా? అని ప్రశ్నించారు. పరకామణి కేసు హైకోర్టులో ఉందని, దానిపైన సీఐడీ విచారణకు ఆదేశించిందని చెప్పారు. ఈ కేసును సీబీఐకి అప్పగించాలని కోరింది భూమన కరుణాకరరెడ్డే అని గుర్తుచేశారు. పరకామణి కేసుకు సంబంధించి కోడూరు బాలసుబ్రమణ్యం వద్ద వివరాలు తీసుకోవాలని సీఐడీకి తమ పార్టీ తరఫున వినతిపత్రం ఇస్తామన్నారు. బాలసుబ్రమణ్యం ఆధారాలు లేకుండా ఫేస్‌బుక్‌లో అబద్ధపు, బూటకపు పోస్టులు పెట్టారంటే.. ఇదివరకు వైఎస్సార్‌సీపీ నాయకుడు నవీన్‌పై పెట్టిన కేసుల్నే ఆయనపైనా పెట్టాలని డిమాండ్ చేశారు. టీటీడీపై బాలసుబ్రమణ్యం పెడుతున్న పోస్టులపై పోలీసులు కేసు నమోదు చేసి తమ పార్టీ నాయకుడు నవీన్‌కు వేసినట్లుగా ముసుగు వేసి జడ్జి ముందు హాజరుపరిచి రిమాండ్‌కు పంపాలన్నారు. గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు కరకంబాడి రోడ్డులో కోడూరు బాలసుబ్రమణ్యం కారుచౌకగా కొన్ని ఎకరాల ప్రభుత్వ భూమిని కొట్టేశారని, దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని బయటపెడతామని వాసుయాదవ్ చెప్పారు.


