స్విమ్స్‌లో త్వరలోనే రోబోటిక్ సర్జరీలు
తిరుపతి తుడా : స్విమ్స్ ఆస్పత్రిలో త్వరలోనే రోబోటిక్ టెక్నాలజీతో సర్జరీలు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు స్విమ్స్ డైరెక్టర్, వీసీ డాక్టర్ ఆర్‌వీ కుమార్ తెలిపారు. మంగళవారం పద్మావతి ఆడిటోరియంలో వికేంద్రీకరణ ఎక్సలెన్స్, డెమోక్రటైజింగ్ యాక్సెస్, భారతదేశంలో ఆరోగ్య సంరక్షణకు ఉజ్వల భవిష్యత్తు అనే అంశంపై సింహాద్రి సత్యనారాయణరావు చైర్ ఒరేషన్‌న్ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన ఆర్‌వీ కుమార్ మాట్లాడుతూ మాజీ మంత్రి సింహాద్రి సత్యనారాయణ రావు జ్ఞాపకార్థం వారి కుమారుడు డాక్టర్ చంద్రశేఖర్ రావు ఏటా సర్జికల్ ఆంకాలజీ విభాగంలో ఛైర్ ఒరేషన్ ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు సర్టికల్ అంకాలజీ విభాగానికి రూ.11 లక్షల ఆర్థికన్‌సాయం సైతం అందించినట్లు వివరించారు. ఈ క్రమంలోనే సర్జికల్ రోబోటిక్ టెక్నాలజీలో విశేష కృషి చేస్తున్న డాక్టర్ విశ్వజ్యోతి పి.శ్రీవాత్సవకు గోల్డ్ మెడల్ ప్రదానం చేసినట్లు తెలిపారు. క్యాన్సర్ విభాగంలో అందుబాటులోకి వచ్చిన ఆధునిక ప్రక్రియలపై వైద్యులు, వైద్య విద్యార్థులు పట్టు సాధించాల్సిన అవసరముందని సూచించారు. కార్యక్రమంలో డీన్ అలోక్ సచన్, రిజిస్ట్రార్ అపర్ణ బిట్లా, విభాగాధిపతి డాక్టర్ నరేంద్ర, డాక్టర్ మణిలాల్, డాక్టర్ శివకుమార్, డాక్టర్ నాగరాజు, డాక్టర్ ముత్తీశ్వరయ్య పాల్గొన్నారు.


