త్రుటిలో తప్పిన ప్రమాదం
కోట : ఆటోను తప్పించే ప్రయత్నంలో ఆర్టీసీ బస్సు చల్లకాలువలోకి ఒరిగిన ఘటన మంగళవారం కోట క్రాస్‌రోడ్డులో చోటుచేసుకుంది. వివరాలు.. బీఎస్‌ఎన్‌ఎల్ కేబుళ్లను భూమిలో అమర్చేందుకు ఇటీవల కోట క్రాస్ నుంచి కిలోమీటర్ల దూరం వరకు రోడ్డు మార్జిన్‌లో గాడి తవ్వారు. పనులు పూర్తయిన తర్వాత గాడిని పూడ్చివేశారు. భారీ వర్షాలకు మట్టి మెత్తబడి ఉండడంతో నాయుడుపేట నుంచి కోటకు వస్తున్న వాకాడు డిపో ఆర్టీసీ బస్సు ఆటోను తప్పించే ప్రయత్నించే రోడ్డు మార్జిన్‌లో కూరుకుపోయింది. ప్రమాదంలో ఇద్దరు ప్రయాణికులకు స్వల్పగాయాలయ్యాయి. పక్కనే కాలువలో పడి ఉంటే పెద్ద ప్రమాదమే జరిగేది. అయితే వెంటనే అప్రమత్తమైన ఆర్టీసీ అధికారులు క్రేన్ సాయంతో బస్సును చల్లకాలువలో పడకుండా బయటకు తీశారు.
అవినీతి ఆరోపణలపై విచారణ
రేణిగుంట : రేణిగుంట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఇన్‌చార్జి సబ్ రిజిస్ట్రార్ ఆనందరెడ్డిపై వెల్లువెత్తిన అవినీతి ఆరోపణలు, అక్రమ రిజిస్ట్రేషన్లపై మంగళవారం విచారణ చేపట్టారు. విచారణాధికారి ముని శంకరయ్య ఆధ్వర్యంలో నలుగురు అధికారులు దర్యాప్తు చేపట్టారు. అయితే ఆరోపణలు ఎదుర్కొంటున్న సబ్ రిజిస్ట్రార్ ఆనందరెడ్డి సమక్షంలోనే డాక్యుమెంట్లు పరిశీలించడంపై పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పైగా విచారణ అధికారులతో కార్యాయలం వెలుప ఆనందరెడ్డి మంతనాలు సాగించడంతో అనుమానాలకు బలం చేకూరిందని స్పష్టం చేస్తున్నారు. అలాగే విచారణ అధికారులకు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ సిబ్బంది, డాక్యుమెంట్ రైటర్లు రాచ మర్యాదలు చేయడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. సుమారు గంటపాటు కార్యాలయంలో విచారణ చేపట్టిన అధికారులు మాత్రం విలేకర్లుకు ఎలాంటి సమాచార ఇవ్వకుండానే వెళ్లిపోయారు. దీంతో విచారణ సవ్యంగా సాగిందా, లేక ఆనందరెడ్డి లాబీయింగ్ పనిచేసిందా అని పలువురు అనుమానం వ్యక్తం చేస్తుండడం గమనార్హం.
త్రుటిలో తప్పిన ప్రమాదం


