
తట్టోడు గుంట దర్జాగా కబ్జా
రామచంద్రాపురం: తిరుపతికి కూతవేటు దూరంలో ఉన్న సి.రామాపురం మండలం తట్టోడుగుంట ప్రస్తుతం కూటమి నాయకుల అక్రమ నిర్మాణాలకు కేంద్రంగా మారింది. గతంలో రైతుల సాగుకు ఆధారమైన ప్రభుత్వ కుంటభూమి కొంతమంది కూటమి నాయకుల కబ్జాలోకి వెళ్లిపోయింది. తిరుపతికి కూత వేటుదూరంలో సి.రామాపురం ఉంది, పట్టణాభివృద్ధి సంస్థలో భాగమై ఉండడం వలన మండల వ్యాప్తంగా భూములకు విపరీతమైన డిమాండ్ ఉంది. దీంతో కూటమి నాయకుల కన్ను ప్రభుత్వ భూములపై పడింది. సర్వే నంబర్ 34/3లో తట్టోడు కుంట సుమారు ఐదు ఎకరాల్లో ఉంది. ఈ తట్టోడుగుంట గతంలో రామాపురం రైతులకు సాగు తాగునీరు అందించేది. కొంతమంది నాయకుల స్వార్థంతో తట్టోడుగుంటకు వచ్చే కాలువలను పూడ్చి, అక్రమ నిర్మాణాలు చేపట్టారు. తట్టోడుగుంటలో ముళ్ల పొదలు బలంగా ఉన్నాయి. రహదారికి సమీపంలో గదులు నిర్మాణాలు జరుగుతున్నప్పటికీ భారీ ముళ్లపొదలు అడ్డుగా ఉండడం వల్ల కనిపించడం లేదు. ఇదే అదునుగా భావించిన కూటమి నాయకులు దర్జాగా గదుల నిర్మించేసి, కోట్ల రూపాయలు సొమ్ము చేసుకుంటున్నారన్న ఆరోపణలున్నాయి. అధికారులకు, ప్రజలు ఫిర్యాదు చేసినా పట్టించుకోకుండా కబ్జాదారులకు కొమ్ము కాస్తున్నారన్న విమర్శలున్నాయి. అయితే ఈ ప్లాట్లను అమాయకులు కొనుగోలు చేసి ఆర్థికంగా నష్టపోతున్నారు. ఇకనైనా ఉన్నత స్థాయి అధికారులు స్పందించి అక్రమ నిర్మాణాలను అడ్డుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.