
వైద్య విద్యను కాపాడుకుందాం
పుత్తూరు: కోటి సంతకాల ప్రజాఉద్యమంతో వైద్య విద్యను కాపాడుకుందామని మాజీ మంత్రి ఆర్కే రోజా పిలుపునిచ్చారు. శనివారం స్థానిక ఏడీకే కల్యాణ మండపంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీ కరణకు వ్యతిరేకంగా వైఎస్సార్‌సీపీ కోటి సంతకాల ప్రజా ఉద్యమంపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలకు నాణ్యమైన విద్యను, వైద్యాన్ని అందించిన ఘనత మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికే దక్కుతుందన్నారు. ఆయన పాలనలో మొత్తం 17 మెడికల్ కళాశాలలకు శ్రీకారం చుట్టారని తెలిపారు. ఇందులో ఐదింటిని పూర్తిచేసి ప్రారంభించగా, మిగిలినవి వివిధ దశల్లో ఉన్నాయన్నారు. ఈవీఎంల ద్వారా అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం జగనన్నకు ఎక్కడ మంచి పేరు వస్తుందోనని అన్ని మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేయడానికి ప్రయత్నిస్తోందని ఆరోపించారు.
బెల్టుషాపులపై ఉన్న శ్రద్ధ.. మెడికల్ కాలేజీలపై లేదా?
గల్లీగల్లీలో బెల్ట్ షాపులు పెట్టడంపై ఉన్న శ్రద్ధ, మెడికల్ కాలేజీలపై ఎందుకు లేదని చంద్రబాబును మాజీ మంత్రి ఆర్కే రోజా నిలదీశారు. వైద్య విద్య ప్రైవేటీకరణను ప్రజాఉద్యంతోనే అడ్డుకోవాలని, దీనికి ప్రతి వైఎస్సార్‌సీపీ కార్యకర్త, నాయకుడు కంకణధారుడు కావాలని పిలుపునిచ్చారు. జగనన్న సీఎంగా తీసుకొచ్చిన పలు సంక్షేమ పథకాలను సైతం తుంగలో తొక్కిన కూటమి ప్రభుత్వంపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని తెలిపారు.
‘సూపర్‌గా’ మోసం!
సూపర్ సిక్స్ పేరిట ప్రతి ఒక్కరినీ మోసం చేశారన్నారు. ఆరోగ్యశ్రీ, చేయూత, ఆసరా వంటి పథకాలను అటకెక్కించారన్నారు. రైతు భరోసా కింద రూ.20 వేలు ఇస్తామని హామీ ఇచ్చారని, రెండేళ్లకు కలిపి రూ.40 వేలు ఇవ్వాల్సి ఉండగా కేవలం రూ.5 వేలు ఇచ్చి మోసం చేశారని తెలిపారు. కూటమి ప్రభుత్వంలో పబ్లిసిటీ ఎక్కువ పని తక్కువ అంటూ ఎద్దేవా చేశారు.
కోటి సంతకాలతో అడ్డుకుందాం
మెడికల్ కళాశాలల వల్ల పేద, మధ్య తరగతి విద్యార్థులకు ఎంత మేలు జరుగుతుందో ప్రజలకు వివరించి సంతకాలు చేయించాలని మాజీ మంత్రి రోజా సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా చేయించే కోటి సంతకాల పేపర్లతో జగనన్న మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులతో కలసి వెళ్లి గవర్నర్‌కు అందజేస్తారని తెలిపారు. తద్వారా వైద్య విద్యను ప్రైవేటీకరణ జరగకుండా కాపాడుకొందామని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఎ.హరి, వైస్ చైర్మన్లు డి.జయప్రకాష్, డీ.శంకర్, వైఎస్సార్‌సీపీ పట్టణ పార్టీ అధ్యక్షుడు ఏకాంబరం, రూరల్ పార్టీ ఆధ్యక్షుడు అన్నా లోకనాథం, ఎంపీపీ మునివేలు, వైస్ ఎంపీపీ మునస్వామిరెడ్డి, కౌన్సిలర్లు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.