
మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను అడ్డుకుంటాం
తిరుపతి సిటీ : ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ చేస్తే ఊరుకునే ప్రసక్తి లేదని యువజన, విద్యార్థి సంఘాలు హెచ్చరించాయి. శనివారం వైఎస్సార్‌సీపీ యువజన విభాగం రీజనల్ కోఆర్డినేటర్ హేమంత్ రెడ్డి ఆధ్వర్యంలో స్థానిక గంధమనేని శివయ్య భవన్‌లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థి, యువజన సంఘాల నేతలు మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు కాసులకు కక్కుర్తి పడి, ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేట్ పరం చేస్తున్నారని విమర్శించారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం తెచ్చిన 17 మెడికల్ కళాశాలలో 7 కళాశాలలు నిర్మాణం పూర్తి చేసుకొని, 5 కళాశాలలో అడ్మిషన్లు పూర్తయ్యి, మిగిలిన కళాశాలల నిర్మాణాలు పురోగతిలో ఉన్నాయని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు సమకూరే వేసలుబాటు ఉన్నా చంద్రబాబు ప్రైవేటీకరణ నిర్ణయం తీసుకోవడం దారుణం అన్నారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి ప్రజల్లో మంచి పేరు వస్తుందనే ఉద్దేశ్యంతో ప్రభుత్వ మెడికల్ కళాశాలలను చంద్రబాబు నిర్వీర్యం చేస్తున్నారని ఆరోపించారు. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాలు సేకరిస్తున్నామని, ఇందులో స్వచ్ఛందంగా ప్రజలు భాగస్వామ్యంకావాలని పిలుపునిచ్చారు.
కోటి సంతకాల కార్యక్రమానికి మద్దుతు
ఏఐఎస్‌ఎఫ్ జాతీయ కార్యదర్శి శివారెడ్డి మాట్లాడుతూ.. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ నిర్ణయానికి వ్యతిరేకంగా వైఎస్సార్‌సీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ ప్రజా ఉద్యమానికి మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. అనంతరం వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఓబుల్‌రెడ్డి మాట్లాడుతూ.. చంద్రబాబు తన బినామీల కోసమే ప్రభుత్వ మెడికల్ కళాశాలలను పీపీపీ విధానంలో తీసుకొస్తున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో ఏఐవైఎఫ్, ఏఐఎస్‌ఎఫ్ జిల్లా కార్యదర్శులు రామకృష్ణ, ప్రవీణ్. వైఎస్సార్‌సీపీ యువజన విభాగం నాయకులు జ్ఞానేంద్ర, నరేష్, వైఎస్సార్ విద్యార్థి విభాగం నాయకులు చెంగల్ రెడ్డి, వినోద్, యశ్వంత్, ఏఐవైఎఫ్ నాయకులు రామకృష్ణ, విక్రమ్, నేషనల్ లా స్టూడెంట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు సుందర్ రాజు, జై భారత్ స్టూడెంట్ యూనియన్ అధ్యక్షుడు భార్గవ్, పలు విద్యార్థి సంఘాల నేతలు పాల్గొన్నారు.