
గ్రామదేవత విగ్రహ ధ్వంసం
బుచ్చినాయుడుకండ్రిగ : మండలంలోని కుక్కంబాకం పంచాయతీ తానిగిల్లు గ్రామ దేవత వేమలమ్మ విగ్రహాన్ని శనివారం రాత్రి గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. ఆదివారం ఈ మేరకు పోలీసుస్టేషన్‌లో గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. గేట్ల తాళాలు పగులగొట్టి ఆలయంలోకి చొరబడి అమ్మవారి ప్రతిమను ధ్వంసం చేశారని పేర్కొన్నారు.
పరిపూర్ణం.. పవిత్రోత్సవం
చంద్రగిరి : శ్రీనివాసమంగాపురంలోని శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో మూడు రోజులుగా నిర్వహించిన పవిత్రోత్సవాలు ఆదివారం పూర్ణాహుతితో పరిపూర్ణమయ్యాయి. ఈ సందర్భంగా ఉదయం స్వామివారిని సుప్రభాతంతో మేల్కొలిపి, తోమాల, కొలువు నిర్వహించారు. యాగశాల వైదిక కార్యక్రమాల అనంతరం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఉత్సవర్లకు వేడుకగా స్నపన తిరుమంజనం జరిపించారు. సాయంత్రం ఆలయ మాడ వీధుల్లో దేవదేవేరులను ఊరేగించారు. ఈ క్రమంలోనే యాగశాలలో వైదిక కార్యక్రమాలు, పూర్ణాహుతి నిర్వహించారు. కుంభప్రోక్షణ, ఆచార్య బహుమానం అందజేశారు. కార్యక్రమంలో ఆలయ స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ ఈఓ వరలక్ష్మి, సూపరింటెండెంట్ రమేష్ బాబు, ఆర్జితం ఇన్‌స్పెక్టర్ ధనశేఖర్ పాల్గొన్నారు.
శ్రీవారి దర్శనానికి 12 గంటలు
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లో కంపార్ట్‌మెంట్లు నిండాయి. శనివారం అర్ధరాత్రి వరకు 82,136 మంది స్వామివారిని దర్శించుకోగా 29,023 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.49 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. దర్శన టిక్కెట్లు లేని భక్తులకు 12 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులకు 3 గంటల్లో దర్శనం లభిస్తోంది.
వీధి కుక్కల దాడిలో చిన్నారికి గాయాలు
బుచ్చినాయుడుకండ్రిగ : స్థానిక ఈబీసీ కాలనీలో ఆదివారం వీధి కుక్కలు దాడి చేయడంతో ఐదేళ్ల చిన్నారి తీవ్రంగా గాయపడింది. కాలు విరిగిపోవడంతో వైద్యులు శస్త్రచికిత్స చేశారు. ఈ క్రమంలో వీధి కుక్కల నియంత్రణకు అధికారులు చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.
రైలు కిందపడి వ్యక్తి మృతి
తిరుపతి క్రైమ్ : తిరుపతి–రేణిగుంట మార్గంలోని రిలయన్స్ అండర్ బ్రిడ్జి వద్ద గుర్తుతెలియని ఓ వ్యక్తి రైలు కింద పడి మృతి చెందిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. సుమారు 50 ఏళ్ల వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడినట్లుగా గుర్తించామని రైల్వే పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని ఎస్వీ మెడికల్ కళాశాలకు తరలించామని వెల్లడించారు. మృతుడు వివరాలు తెలిసిన వారు 9440627638 నంబర్‌లో సంప్రదించాలని కోరారు.