
పోలీసుల తీరుపై పాత్రికేయుల నిరసన
చిల్లకూరు : మీడియా ప్రతినిధులపై వరుసగా దాడులు జరుగుతున్నప్పటికీ పోలీసులు పట్టించుకోకపోవడంపై ఆదివారం గూడూరు టవర్ క్లాక్ వద్ద పలువురు పాత్రికేయులు నిరసన తెలిపారు. ముందుగా అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం రోడ్డుపై బైఠాయించి వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టణంలో అసాంఘిక కార్యక్రమాలు అధికమవుతున్నాయని, వాటిని ప్రశ్నించిన మీడియా ప్రతినిధులపై యథేచ్ఛగా దాడులకు దిగుతున్నారని ఆరోపించారు. అందులో భాగంగా ఈ నెల 15వ తేదీన ఓ ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలకు చెందిన ముగ్గురు విద్యార్థులు ఫూటుగా మద్యం తాగి బైక్‌పై వెళుతూ కిందపడిపోయారని, వారిని పైకి లేపినందుకు విలేకర్లపైన దాడి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటివి పోలీసుల దృష్టికి తీసుకెళితే హేళనగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. విషయం తెలుసుకున్న రూరల్ ఎస్‌ఐ తిరుపతయ్య వెంటనే అక్కడకు చేరుకుని విలేకర్లకు నచ్చజెప్పారు. డీఎస్పీతో మాట్లాడి తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో జర్నలిస్టులు ఆందోళన విరమించారు.
రోడ్డుపై భైఠాయించిన మీడియా ప్రతినిధులు

పోలీసుల తీరుపై పాత్రికేయుల నిరసన