కమీషన్ల వైద్యం | - | Sakshi
Sakshi News home page

కమీషన్ల వైద్యం

Oct 20 2025 9:34 AM | Updated on Oct 20 2025 9:34 AM

కమీషన్ల వైద్యం

కమీషన్ల వైద్యం

చిన్నారులను అనారోగ్యం బారిన

పడేస్తున్న వైనం

తమిళనాడు, కర్ణాటక నుంచి

చిత్తూరు జిల్లాకు మందుల సరఫరా

కమీషన్‌ అధికంగా వచ్చే మందులనే రెఫర్‌ చేస్తున్న వైద్యులు

పలు ప్రైవేటు ఆస్పత్రుల కక్కుర్తి

పట్టించుకోని అధికారులు

చిత్తూరు రూరల్‌ (కాణిపాకం): మధ్యప్రదేశ్‌లో కోల్డ్రిఫ్‌ అనే దగ్గు సిరఫ్‌ పసి ప్రాణాలను బలిగొంది. అలాగే రాజస్థాన్‌లోని మరణాలు సంభవించాయి. సిరఫ్‌ తీసుకున్న పిల్లలు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. జ్వరం, పొట్ట ఉబ్బిపోయి...మూత్రపిండాలు దెబ్బతినడంతో మరణాలు సంభవించాయి. ఈ విషయం దేశ వ్యాప్తంగా కలకలం సృష్టించడంతో ఆందోళనకు దారి తీసింది. ఈ ఘటన జిల్లా వ్యాప్తంగా ప్రైవేటు వైద్యంలో భద్రతను ప్రశ్ని స్తోంది.

కాసుల కక్కుర్తి

జిల్లాలో మెడికల్‌ మాఫియా రెచ్చిపోతోంది. ఇష్టారాజ్యంగా తమిళనాడు, కర్ణాటక నుంచి జిల్లాలో మందులు, మాత్రల వ్యాపారాన్ని నడిపిస్తోంది. కాసుల కక్కుర్తికి పాల్పడుతోంది. నాణ్యత లేని వాటిని అంటగడుతున్నారు. ప్రైవేటు ఆస్పత్రులు నిబంధనలు అతిక్రమిస్తోంది. ప్రధానంగా పసి వైద్యం పెనుగండంగా మారింది. పసి ప్రాణాలను బలి తీసుకుంటోంది. అయినా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

జిల్లాలో ఇలా..

జిల్లాలో అధికారికంగా 1200 ప్రైవేటు ఆస్పత్రులున్నాయి. అనాధికారికంగా 1000పైగా నడస్తున్నాయి,. ఆర్‌ంఎపీ క్లీనిక్‌లు 2వేల వరకు ఉంటున్నాయి. ఇటీవల 150 వరకు నకిలీ ఆర్‌ఎంపీలు పట్టుబడగా..ఇంకా వేల మంది నకిలీ ఆర్‌ఎంపీల అవతారాన్ని గుట్టు రట్టు చేయాల్సి ఉంది. దీనికి తోడు మెడికల్‌ షాపులు 1500 వరకు ఉన్నాయి. వీటిలో చాలా వరకు నిబంధనలు అతి క్రమిస్తున్నాయి. ఇష్టానుసారంగా మందులు, మాత్రలు అమ్మేస్తున్నాయి.

అనుమతి లేని ఏజెన్సీలు

తమిళనాడు, కర్ణాటక రాష్ట్రం నుంచి జిల్లాకు అత్యధికంగా మందులు, మాత్రలు సరఫరా అవుతున్నాయి. నిత్యం రూ. కోటి విలువ చేసే మెడిషన్లు జిల్లాకు దిగుమతి అవున్నాయి. రోజు వారీగా రూ.50 లక్షల నుంచి రూ.60 లక్షల వరకు వ్యాపారం నడుస్తోంది. ఇదే అదునుగా చేసుకుని మెడికల్‌ ఏజెన్సీలు పుట్టగొడుగులా పుట్టుకొచ్చాయి. జిల్లాలో 40పైగా ఏజెన్సీలు ఉండగా...అనుమతులు లేని ఏజెన్సీలు పదుల సంఖ్యలో ఉన్నట్లు వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ కారణంగా కొన్ని నాణ్యత లేని మందులు, మాత్రలు మార్కెట్లోకి చేరిపోతున్నాయని అంటున్నారు. కంపెనీలు కొత్తగా తయారు చేసిన మందులు, మాత్రలు డ్రగ్స్‌ కంట్రోల్‌ అనుమతులు రాకముందే మార్కెట్‌లోకి వచ్చేస్తున్నాయని వెల్లడిస్తున్నారు. చాలా మంది వైద్యులు కమీషన్లకు కుక్కర్తి పడి... నాణ్యత లేని మందులను రెఫర్‌ చేస్తున్నారని, ఇది ప్రజానీకానికి ప్రమాదం పొంచి ఉందని పలువురు నిపుణులు హెచ్చరిస్తున్నారు.

కోల్డ్రిఫ్‌లో ఏముంది..

మధ్యప్రదేశ్‌లో దగ్గు సిరఫ్‌ తీసుకున్న పిల్లలు మరణించారు. అక్కడి ప్రభుత్వం చేపట్టిన పరిశీలనలో పలు విషయాలు బయటకొచ్చాయి. తమిళనాడు ప్రభుత్వం సైతం ఆ సిరఫ్‌పై పరిశీలన చేయగా వాస్తవాలను బయటపెట్టి..ఉత్పత్తిని ఆపేసింది. కోల్డ్రిఫ్‌ అనే దగ్గు సిరఫ్‌లో (బ్యాచ్‌ నంబర్‌ –ఎస్‌ఆర్‌ –13), డై ఇథైలిన్‌ గ్‌లైకాల్‌ (డీఈజీ–48.6శాతం) అనే ప్రమాదకర రసాయనం పరిమితికి మించి ఉన్నట్లు తేలింది. ఇదంతా పిల్లలను హరించేలా పనిచేస్తాయని వెలుగులోకి వచ్చింది. ప్రధానంగా ఇదీ కిడ్నీపై ప్రభావితం చేస్తోందని బయటపడింది.

కట్టడి చర్యలు ఏమాత్రం...

మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలో జరిగిన ఘటనలు చూసి కూడా జిల్లా అధికారుల్లో కనీస చలనం లేదు. జిల్లా లో అనధికారిక ఆస్పత్రులు కుప్పలు తెప్పలుగా ఉన్న చూసీ చూడనట్లు వదిలేస్తున్నారు. జిల్లాలో పలు ఆర్‌ఎంపీల వద్ద చికిత్స తీసుకుని పిల్లలు మృతి చెందిన ఘటనలు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ, డ్రగ్స్‌ నియంత్రణ శాఖ అధికారులకు కనువిప్పు కలిగించడం లేదు. ఇలానే వదిలేస్తే..మరో మధ్యప్రదేశ్‌ వంటి ఘటనలను జిల్లాలో చూడక తప్పదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

చిన్న పిల్లల మందులు సైతం...

జిల్లాలో ప్రధానంగా గుండె, బీపీ, షుగర్‌, క్యాన్సర్‌, తదితర సమస్యలకు సంబంధించిన మందులు, మాత్రలు మాత్రమే ఎక్కువగా అమ్ముడుబోతున్నాయి. తర్వాత గర్భిణులు, చిన్నపిల్లలకు సంబంధించిన మాత్రలు అధిక మొత్తంలో విక్రయాలు జరుగుతున్నాయి. కానీ పిల్లల విష యంలో చాలా మంది వైద్యులు సరైన నిబంధన లు పాటించడం లేదు. చికిత్స చేయడంతో పాటు జ్వరం, జలుబు వంటి వాటికి కూడా ఇంజెక్షన్లు, సిరఫ్‌ ఇచ్చేస్తున్నారనేది ఇప్పుడు ప్రధానమైన వాదనగా నడుస్తోంది. అందులోనూ అధికంగా కమీషన్‌ ఇచ్చే మందులు, మాత్రలను మాత్రమే రెఫర్‌ చేస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. మధ్యప్రదేశ్‌లో తరహాలో జిల్లాలో కూడా చాలా మంది వైద్యులు చిన్న పిల్లల దగ్గు, జలుబు నివారణకు కోల్డ్రిఫ్‌ను రెఫర్‌ చేశారని పలువురు అంటున్నారు. ఈ కోల్డ్రిప్‌ తయారీ కంపెనీ తమిళనాడులోని చైన్నెలో ఉండడం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement