
కోటి సంతకాలతో ప్రజా ఉద్యమం
కోట : కోటి సంతకాల సేకరణతో ప్రజా ఉద్యమానికి వైఎస్సార్‌సీపీ శ్రీకారం చుట్టిందని, దీంతో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను కూటమి ప్రభుత్వం ఉపసంహరించుకోవాల్సిందేనని ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్ స్పష్టం చేశారు. ఆదివారం కోట మండలంలోని అల్లంపాడు, వంజివాక, పుచ్చలపల్లెలో పార్టీ సీఈసీ సభ్యుడు పేర్నాటి శ్యాంప్రసాద్‌రెడ్డి నేతృత్వంలో కోటి సంతకాల సేకరణ, రచ్చబండ నిర్వహించారు. ఎమ్మెల్సీ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు పరిపాలన మోసపూరితంగా సాగుతోందన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు పంగనామాలు పెట్టారని ఆరోపించారు. గతంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రత్యేకంగా కేంద్రంతో పోరాడి 17 మెడికల్ కళాశాలలను తీసుకువస్తే, వాటిని కుట్రపూరితంగా ప్రైవేటు వ్యక్తులకు అప్పగించేందుకు చంద్రబాబు పన్నాగం పన్నుతున్నారని విమర్శించారు. పేద విద్యార్థులను వైద్య విద్యకు దూరం చేసేందుకు తెగబడుతున్నారని మండిపడ్డారు. వైఎస్సార్‌సీపీ గూడూరు నియోజకవర్గ పరిశీలకుడు బీరేంద్రవర్మ మాట్లాడుతూ జగన్‌మోహన్‌రెడ్డి విద్యావ్యవస్థలో అనేక మార్పులు తీసుకువచ్చారన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్, నాడు–నేడుతో పాఠశాలల రూపురేఖలు మార్చారని కొనియాడారు. సీఈసీ సభ్యుడు పేర్నాటి శ్యాంప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ యూరియా కోసం రైతులు క్యూలో బారులు తీరిన ఘటనలు గతంలో ఎప్పుడూ లేవన్నారు. కూటమి ప్రభుత్వంలో అన్నదాతలు అవస్థలు పడుతున్నారని ఆరోపించారు. అనంతరం కోటి సంతకాల సేకరణ చేపట్టారు. కార్యక్రమంలో పార్టీ మండల కన్వీనర్ పలగాటి సంపత్‌కుమార్‌రెడ్డి, కోట, చిల్లకూరు మహిళా కన్వీనర్లు రేష్మ, లలిత, నేతలు రమణారెడ్డి, మధుసూదన్‌రెడ్డి, పాదర్తి రాధాకృష్ణారెడ్డి, సర్పంచ్ ఈశ్వర్‌రెడ్డి, ఉప సర్పంచ్ రాంబాబు, సాయిరెడ్డి, ప్రసాద్‌గౌడ్, సురేంద్ర, జెడ్పీటీసీ సభ్యుడు కోటయ్య పాల్గొన్నారు.

కోటి సంతకాలతో ప్రజా ఉద్యమం