
ఏఐ టెక్నాలజీతో బోధన
తిరుపతి సిటీ: ఏఐ టెక్నాలజీతో విద్యార్థులకు పాఠ్యాంశాలను బోధించాలని డీఎస్సీలో ఇటీవల ఉద్యోగాలు సాధించిన ఉపాధ్యాయులకు సమగ్ర శిక్ష అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ గౌరీ శంకర్ సూచించారు. తిరుపతిలోని విశ్వం స్కూల్‌లో ఐదు రోజులుగా ఉపాధ్యాయులకు నిర్వహిస్తున్న శిక్షణ తరగతుల ముగింపు కార్యక్రమానికి మంగళవారం ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. గౌరీశంకర్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్లు పెంచేందుకు కృషి చేయాలని, డ్రాపవుట్లు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. పిల్లలకు నాణ్యమైన విద్యను అందించేందుకు శ్రమించాలని పిలుపునిచ్చారు. డీఈఓ కేవీఎన్ కుమార్ మాట్లాడుతూ తెలుగు, గణితం, పరిసరాల విజ్ఞానం సబ్జెక్టులకు సంబంధించిన పాఠ్యపుస్తకాలు, వర్క్‌షీట్లు, స్టూడెంట్ అసెస్‌మెంట్ బుక్లెట్స్ అనుసంధానంగా బోధించాలన్నారు. పాఠశాలలో నిర్వహించాల్సిన రిజిస్టర్లపై సమగ్ర అవగాహనతో శిక్షణ పొందాలని స్పష్టం చేశారు. జిల్లా నోడల్ అధికారి నరసింహులు, స్టేట్ అబ్జర్వర్‌తో పాటు డీవైఇఓ మహేశ్వర రావు, ఎంఈఓలు బాలాజీ, జనార్ధన్ రాజు, ప్రేమలత, అసిస్టెంట్ అలెస్కో మీనాక్షి, సమగ్ర శిక్ష సెక్టోరియల్ అధికారి కేడీ సారథి పాల్గొన్నారు.