
అసలు నిందితులను అరెస్టు చేయాలి
దేవళంపేటలో అసలు నిందితులను అరెస్ట్ చేయాలంటూ ఆందోళన
చేస్తున్న వైఎస్సార్‌సీపీ నాయకులు
తిరుపతి మంగళం : గంగాధరనెల్లూరు నియోజకవర్గంలోని దేవళంపేటలో అంబేడ్కర్ విగ్రహాన్ని తగలపెట్టిన అసలు నిందితులను పోలీసులు అరెస్ట్ చేయాలని వైఎస్సార్‌సీపీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు తలారి రాజేంద్ర డిమాండ్ చేశారు. తిరుపతి జీవకోనలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద గురువారం పార్టీ నాయకులతో కలిసి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రాజేంద్ర మాట్లాడుతూ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహాన్ని రాజకీయ కక్షలతో టీడీపీకి చెందిన సతీష్‌నాయుడు తగల పెట్టించారని ఆరోపించారు. గతంలో అక్కడ స్థానిక సర్పంచ్ గోవిందయ్య అంబేడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తుంటే సతీష్‌నాయుడు అడ్డుకున్నాడని, అయినప్పటికీ అక్కడి దళితులంతా ఒక్కటై ఏర్పాటు చేశారన్నారు. ఆ విషయాలను మనసులో పెట్టుకుని సతీష్‌నాయుడు అంబేడ్కర్ విగ్రహాన్ని తగల పెట్టించాడని, దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన సర్పంచ్ గోవిందయ్య పైనే తిరిగి కేసు నమోదు చేసి అరెస్ట్ చేయించడం కూటమి నాయకుల అరాచకాలు, దుర్మార్గాలకు నిదర్శనమన్నారు. పోలీసులు సైతం కూటమి నాయకులకు కొమ్ముకాస్తూ అంబేడ్కర్ విగ్రహ దహనాన్ని చాలా చులకనగా తీసుకుంటున్నారని మండిపడ్డారు. ఇప్పటికై నా అసలైన నిందితులను అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని, లేనిపక్షంలో వైఎస్సార్‌సీపీ తరఫున పెద్దఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి అజయ్‌కుమార్, రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు బత్తల గీతాయాదవ్, టౌన్‌బ్యాంక్ వైస్ చైర్మన్ వాసుయాదవ్, పార్టీ నాయకులు శ్రీనివాసులు, చేజర్ల మురళి, మద్దాలి శేఖర్, ఆటో ప్రసాద్, కుప్పయ్య, రమణ, శారద, కవితమ్మ, శాంతారెడ్డి, సరస్వతమ్మ, దుర్గ, కుమారమ్మ పాల్గొన్నారు.