
సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రగడ
● అటెండర్, సబ్ రిజిస్ట్రార్ మధ్య వివాదం ● సబ్ రిజిస్ట్రార్‌పై అటెండర్ దూషణల పర్వం
రేణిగుంట : నిత్యం అనేక ఆర్థిక లావాదేవీలు జరుగుతూ రద్దీగా ఉండే రేణిగుంట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో గురువారం ఉదయం అటెండర్, సబ్ రిజిస్ట్రార్ మధ్య రగడ నెలకొనడంతో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. గురువారం ఉదయం సమయానికి డ్యూటీకి రాలేదని అందరి ముందు అటెండర్ తిరుమలేష్‌ను సబ్ రిజిస్ట్రార్ ప్రశ్నించడంతో అవమానంగా భావించిన అటెండర్ సబ్ రిజిస్ట్రార్‌పై తిరగబడి ఇష్టానుసారంగా దూషించడంతో పాటు, కార్యాలయంలో లంచాలు ఎక్కువవుతున్నాయని, ప్రైవేట్ వ్యక్తుల ప్రమేయం అధికంగా ఉందని పెద్దగా కేకలు వేస్తూ హల్‌చల్ చేశారు. అక్కడికి వచ్చిన విలేకరులను సైతం సబ్ రిజిస్ట్రార్‌కు వత్తాసు పలుకుతున్నారంటూ వారిపైన అటెండర్ దురుసుగా ప్రవర్తించారు. కొంతకాలం క్రితం వీరి మధ్య వివాదం నెలకొని పోలీస్ స్టేషన్ వరకు వెళ్లింది. ప్రస్తుతం మళ్లీ వారి మధ్య వివాదం రాజుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఈ విషయంపై సబ్ రిజిస్ట్రార్ ఆనంద రెడ్డి వివరణ ఇస్తూ నిత్యం అటెండర్ విధులకు ఆలస్యంగా వస్తున్నారని ఆ విషయం అడిగినందుకు తనపై దుర్భాషలాడినట్లు తెలిపారు. ఈ ఘటనపై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుని వెళ్తానని చెప్పారు.