
జనసేన కార్యకర్త ఆత్మహత్య
కోట : విచారణ పేరుతో పోలీసులు వేధించారని బంధువులకు చెప్పి కోట మండలంలో ఓ జనసేన కార్యకర్త మంగళవారం ఆత్మహత్యకు యత్నించి చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. వివరాలు.. మండలంలోని చిట్టేడుకు చెందిన జనసేన కార్యకర్త అనిల్ (35) కొంత కాలంగా స్కీమ్‌ల పేరుతో పలువురు నుంచి సుమారు రూ.10 లక్షల వరకు వసూలు చేశాడు. కాలపరిమితి దాటినా తిరిగి చెల్లించకుండా తప్పించుకు తిరుగుతున్నాడు. ఈ క్రమంలో వారం క్రితం గ్రామానికి చెందిన మంగమ్మ అనే మహిళ తాను చెల్లించిన రూ.10 వేలు తిరిగి ఇవ్వాలని కోరింది. దిక్కున్న చోట చెప్పుకోమని అనిల్ బెదిరించడంతో ఆమె నిద్ర మాత్రలు మింగి ఆస్పత్రి పాలైంది. అనంతరం కోట పోలీస్ స్టేషన్‌లో ఎస్‌ఐ పవన్‌కుమార్‌కు ఫిర్యాదు చేసింది. దీంతో అనిల్‌ను ఎస్‌ఐ పిలిపించి మంగళవారం విచారణ చేపట్టారు. ఆ సమయంలో ఆమె వద్ద తాను నగదు తీసుకున్న మాట వాస్తవమేనని అనిల్ ఒప్పుకున్నాడు. దీంతో ఎవరి దగ్గర ఎంత మొత్తంలో నగదు వసూలు చేశావు అనే పూర్తి వివరాలు తీసుకుని రావాలని చెప్పి అనిల్‌ను ఇంటికి పంపి వేశారు. ఇంటికి వచ్చిన అనిల్ తన స్నేహితులు, బంధువుల వద్ద కోట ఎస్‌ఐ తనను వేధించాడని వాపోయాడు. గడ్డి మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. కుటుంబీకులు తిరుపతిలోని ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తుండగా బుధవారం మృతి చెందాడు. అయితే మృతుడికి గతంలో వివాహమై ఇద్దరు పిల్లలు ఉన్నప్పటికి ఆమెను వదలి వేసి మరో మహిళను పెళ్లి చేసుకున్నాడని , జీవనం కోసం ఇలాంటి స్కీమ్‌లతో నగదు వసూలుకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో అనిల్ కుటుంబ సభ్యులు కోట ఎస్‌ఐపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. ఈ విషయమై వాకాడు సీఐ హుసేన్ బాషాను వివరణ కోరగా ఈ కేసును తాను విచారణ చేసి నివేదికలను ఉన్నతాధికారులు అందిస్తామని వెల్లడించారు.