
వాణిజ్యాభివృద్ధి దిశగా తిరుపతి రైల్వేస్టేషన్
తిరుపతి అన్నమయ్యసర్కిల్ : తిరుపతి రైల్వేస్టేషన్ ఇకపై వాణిజ్య అభివృద్ధి దిశగా రూపాంతరం చెందుతుందని రైల్ ల్యాండ్ డెవలప్‌మెంట్ అథారిటీ (ఆర్‌ఎల్‌డీఏ) అధికారులు వెల్లడించారు. బుధవారం తిరుచానూరు రోడ్డులోని ఓ ప్రైవేట్ హోటల్‌లో ప్రీ బిడ్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైల్వే స్టేషనన్‌లో కొత్తగా ఆధునీకరించనున్న భవనంపై దక్షిణ వైపున 36,640 చ.మీ స్థలాన్ని వాణిజ్య అభివృద్ధి కోసం 60 ఏళ్లపాటు లీజుకు ఇచ్చేందుకు టెండర్లను ఆహ్వానించినట్లు తెలిపారు. ఈ ఆధునికీకరణ ప్రాజెక్టులో భాగంగా సరికొత్త విధానం అమలు చేసేందుకు చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. దీంతో తిరుపతి రైల్వే స్టేషన్‌న్‌లో కొత్తగా వాణిజ్య అభివృద్ధిని సులభతరం చేయడానికి ఆస్కారం ఏర్పడిందన్నారు. ఇది బ్రాండెడ్ అవుట్‌లెట్‌లు, ఫుడ్ కోర్టులు, రెస్టారెంట్‌లు, రిటైల్ దుకాణాలు, షోరూమ్‌ల ఏర్పాటుకు వీలు కల్పిస్తుందని వివరించారు. రైల్వే భూమిని ఎలా లీజుకు ఇస్తున్నారో, రైల్వే స్టేషన్‌న్‌పై వాణిజ్య ప్రభావం, ఈ టెండర్ విధానం వంటి అంశాలపై ఉదహరిస్తూ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఇన్వెస్టర్లకు వివరించారు. సమావేశంలో ఆర్‌ఎల్‌డీఏ చీఫ్ ప్రాజెక్టు మేనేజర్ విష్ణువర్ధన్‌రావు, జేజీఎం శ్రీనివాసరావు, ప్రాజెక్టు మేనేజరు షకీల్ అహ్మద్ పాల్గొన్నారు.