
మామిడి రైతుల పరిష్కారానికి పోరాడుదాం
చంద్రగిరి: మామిడి దిగుబడిలో ఈ ఏడాది ఆశించిన స్థాయిలో ధరలు లేకపోవడంతో ఉమ్మడి జిల్లాలో మామిడి రైతులు తీవ్రంగా నష్టపోయారని, వారి సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక కార్యాచరణ రూపొందించనున్నట్లు రైతు నేత యారాశి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. సోమవారం మామిడి రైతుల సమస్యల పరిష్కారం కోసం యారాశి చంద్రశేఖర్ రెడ్డి నేతృత్వంలో చంద్రగిరిలో చర్చా వేదిక నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గంలోని అన్ని మండలాల నుంచి పెద్దఎత్తున రైతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉమ్మడి జిల్లాలోని మామిడి రైతుల సమస్యలను కేంద్రంగా తీసుకుని ఒక ప్రత్యేక చర్చా వేదిక ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రైతులు గత కొన్నేళ్లుగా ఎదుర్కొంటున్న కష్టాలు, ప్రభుత్వ సహాయాలు రాలేకపోవడం, గుజ్జు పరిశ్రమల సమస్యలు, మామిడి ఉత్పత్తుల సరైన ధరల కోసం వారి హక్కుల పరిరక్షణ వంటి అంశాలు చర్చించడం జరుగుతుందన్నారు.
రూ.196 కోట్ల సబ్సిడీ నిధులు విడుదల చేయాలి
ప్రభుత్వం కిలో మామిడికి రూ.4 సబ్సిడీ నగదు జిల్లావ్యాప్తంగా రూ.196 కోట్ల మేర రైతులకు అందజేయాల్సి ఉందన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం చంద్రబాబు సబ్సిడీ నగదును మామిడి రైతులకు అందించడం జరిగిందన్నారని, అయితే ఇప్పటి వరకు నగదు జమ చేయలేదని, వెంటనే రైతులకు అందజేయాలని కోరారు.
సిండికేట్‌తో మరింత నష్టాల్లో రైతులు..
మామిడి కాయల మండీల్లో దళారులు అంతా కలిసి సిండికేట్‌గా మారడం ద్వారా మరింతగా మామిడి రైతులు నష్టపోతున్నారన్నారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో డీటీకి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో నాయకులు ఎద్దల చంద్రశేఖర్ రెడ్డి, ఔరంగజేబు, ప్రకాష్ రెడ్డి, మాజీ ఎంపీపీ కుసుమ, ప్రతాప్ రెడ్డి, మురగయ్య యాదవ్, కృష్ణారెడ్డి, విజయ్ కుమార్ రెడ్డి, గురవారెడ్డి, పరమేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.