
నేటి నుంచి బోధనేతర పనులు బంద్
తిరుపతి సిటీ : ప్రభుత్వం నిర్ణయించిన మితిమీరిన బోధనేతర పనులతో సమయం హరించుకుపోతోందని, శుక్రవారం నుంచి ఆ పనులను నిలిపివేస్తున్నట్లు ఏపీ ఫ్యాప్టో, ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య (ఎస్‌టీయూ) ప్రభుత్వానికి తేల్చి చెప్పింది. ఈ మేరకు గురువారం తిరుపతి అర్బన్ మండల విద్యాశాఖాధికారికి ఎస్‌టీయూ నాయకులు వినతిపత్రం సమర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ఉపాధ్యాయులకు బోధన సమయం కంటే బోధనేతర వ్యవహారాలు పెరిగిపోయాయని, ఈ విషయంపై పలుమార్లు ప్రభుత్వానికి విన్నివించినా పట్టించుకోకపోవడం దారుణమన్నారు. విద్యార్థులకు చదువు చెప్పడంతో పాటు, బోధనేతర పనులతో ఉపాధ్యాయులు ఒత్తిడికి గురై పలు వ్యాధులకు లోనవుతున్నారని తెలిపారు. ఉపాధ్యాయుల హాజరు, విద్యార్థుల హాజరు, మధ్యాహ్న భోజనానికి సంబంధించిన వివరాలు తప్ప ఏ ఇతర బోధనేతర పనులు చేయబోమని తేల్చి చెప్పారు. అనవసరమైన గూగుల్ ఫీట్స్, విద్యాశక్తి, జీఎస్‌టీ వంటి ప్రభుత్వ సీజనల్ ప్రచారాలను ఉపాధ్యాయులు ఇక నుంచి చేయరని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం చైర్మన్ సాయి శ్రీనివాస్, కార్యదర్శి చిరంజీవి, నరహరి, ప్రకాష్‌రావు, వెంకటేశ్వర్లు, మనోజ్ కుమార్, సభ్యులు, పెద్ద సంఖ్యలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
టీటీడీ డిప్యూటీ ఈఓల బదిలీ
తిరుపతి అన్నమయ్య సర్కిల్ : టీటీడీలోని పలు విభాగాల్లో పనిచేస్తున్న డిప్యూటీ ఈఓలను బదిలీ చేశారు. శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈఓగా పనిచేస్తున్న లోకనాథంను తిరుపతిలో గోవిందరాజస్వామి ఆలయానికి బదిలీ చేశారు. అలాగే శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈఓగా హరీంద్రనాథ్‌ను నియమించారు. హెచ్‌ఆర్ డిప్యూటీ ఈఓగా భాస్కర్, తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయానికి డిప్యూటీ ఈఓగా శాంతిని బదిలీ చేశారు. కాగా ఆర్–1 డిప్యూటీ ఈఓగా నియమితులైన రాజేంద్రకు ఆర్–2 ఇన్‌చార్జిగా అదనపు బాధ్యతలు అప్పగించారు. తిరుమల అన్నదానం డిప్యూటీ ఈఓగా సెల్వం, తిరుపతి అన్నదానం డిప్యూటీ ఈఓగా వెంకటయ్య, కల్యాణకట్ట డిప్యూటీ ఈఓగా గోవిందరాజన్‌కు డోనర్ సెల్ ఇన్‌చార్జిగా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఆదేశాలు వెలువడ్డాయి.