
అడ్డు తొలగించారు!
తిరుపతి జేసీ బదిలీ వెనుక రాజకీయం
సాక్షి టాస్క్‌ఫోర్స్ : ఆక్రమణలను ఎప్పటికప్పుడు అడ్డుకుంటున్న తిరుపతి జిల్లా జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్‌ను కూటమి నేతలు పట్టుబట్టి బదిలీ చేయించారు. జేసీగా శుభం బన్సల్ ఉన్నన్ని రోజులు స్వేచ్ఛగా ఆక్రమణలు చేయలేమని ‘ముఖ్య’ నేతలపై తీవ్ర స్థాయిలో ఒత్తిళ్లు చేశారు. మెజారిటీ కూటమి నేతలు కలిసి మూకుమ్మడిగా ఒత్తిడి చేసి జేసీ శుభం బన్సల్‌ని బదిలీ చేసి పంతం నెగ్గించుకున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక గత ఏడాది జూలై 24న తిరుపతి జిల్లా జాయింట్ కలెక్టర్‌గా శుభం బన్సల్ బాధ్యతలు చేపట్టారు. అధికారం వచ్చిన వెంటనే జిల్లా వ్యాప్తంగా కూటమి నేతలు భూ ఆక్రమణలకు తెరతీశారు. ఒకటి కాదు రెండు కాదు.. యథేచ్ఛగా ఆక్రమణలకు బరితెగించటం ప్రాంభించారు. అందులో ముఖ్యంగా గూడూరు నియోజక వర్గం చిల్లకూరు మండల పరిధిలో క్రిస్ సిటీ కోసం సేకరిస్తున్న భూముల్లో ఎక్కువగా ప్రభు త్వ భూములు ఉన్నాయి. ఆ ప్రభుత్వ భూముల పేరు తో కూటమి నేతలు బినామీ పేర్లు చేర్చి పరిహారం కింద వచ్చే కోట్ల రూపాయలను జేబులు నింపుకోవాలని తీవ్ర ప్రయత్నాలు చేపట్టారు. ఇదే చిల్లకూరు మండలం కడివేడు పరిధిలో కూటమి నేతల ఆక్రమణలో ఉన్న సీలింగ్ భూములకు రికార్డులు చేసుకునేందుకు యత్నించగా జేసీ అడ్డుపడుతూ వచ్చారు. ఇంకా వెంకటగిరి పరిధిలో ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురికాకుండా జేసీ అడ్డుగా నిలిచారు.
అడ్డుపడుతుండడంతో మింగుడుపడక
శ్రీకాళహస్తి నియోజకవర్గ పరిధిలో కూటమి నేతల భూ ఆక్రమణలకు అడ్డుపడుతూ వచ్చారు. రేణిగుంట విమానాశ్రయం సమీపంలోని వికృతమాల పరిధిలో కూటమి నేతల అధీనంలో ఉన్న ఉన్న అక్రమ నిర్మాణాలకు అడ్డుచెప్పినట్లు తెలిసింది. శ్రీకాళహస్తి రూరల్ పరిధిలో ఏర్పేడు– వెంకటగిరి మార్గంలోని విలువైన ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా జేసీ అడ్డుకున్నారు.తిరుపతి నగర పరిధిలోని ఎర్రమిట్ట వద్ద సర్వే నంబర్ 101లో కోట్ల రూపాయలు విలువైన భూమిని స్థానిక కూటమి నేతలు ప్లాట్లు వేసి పంచుకునేందుకు సిద్ధమయ్యారు. ఇళ్ల స్థలాలు లేని నిరుపేదలంటూ 28 పేర్లతో జాబితా సిద్ధం చేశారు. ఆ జాబితా ఫైల్‌ను జేసీ వద్దకు తీసుకెళ్లగా సంతకం చేయడానికి నిరాకరించినట్లు సమాచారం. అలాగే తిరుపతి నగరంలోనే మరికొన్ని ఆక్రమణలకు జేసీ అడ్డుపడుతూ వచ్చారు. చంద్రగిరి పరిధిలో ఇటీవల కాలంలో కూటమి నేతలు ఓ కుటుంబాన్ని తీవ్ర ఇబ్బందులకు గురిచేశారు. వారి నివాసానికి వెళ్లకుండా ఇనుప కంచెవేశారు. ఈ విషయాన్ని బాధితులు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. వారు స్పందించకపోవడంతో బాధితులు నేరుగా జేసీ శుభం బన్సల్‌ని కలిసి తమ గోడును వెళ్లబోసుకున్నారు. వెంటనే స్థానిక అధికారులకు ఫోన్‌చేసి సీరియస్ అయినట్లు సమాచారం. స్థానిక అధికారులు జేసీపై కూటమి నేతలకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. తిరుపతి రూరల్, మంగళం పరిధిలోని విలువైన స్థలాలు ఆక్రమణకు గురికాకుండా అడ్డుపడ్డారు. ఇంకా సూళ్లూరుపేట నియోజకవర్గం నాయుడుపేట పరిధిలో విలువైన భూమిని ఆక్రమణకు గురికాకుండా అడ్డు కున్నారు. ఇదిలా ఉంటే.. తుడా వైస్ చైర్మన్‌గా జేసీని నియమించడంపై కూటమి నేతలు జీర్ణించుకోలేకపోయారు. వైస్ చైర్మన్‌గా ఆర్డీఓ స్థాయి అధికారి అయితే చెప్పినట్లు వింటారని కూటమి నేతలు నిర్ణయించుకున్నారు. నిజాయతీగా అధికారిగా పేరున్న శుభం బన్సల్ కూటమి నేతల ఒత్తిళ్లకు తలొగ్గకపోవడంతో అంతా ఏకమయ్యారు. కూటమి నేతలకు ఓ బడా పారిశ్రామిక వేత్త తోడయ్యారు. రెండు రోజుల క్రితం వీరంతా కలిసి ‘ముఖ్య’ నేతలపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి చేయడంతో బదిలీ చేశారని జోరుగా ప్రచారం సాగుతోంది.