
ఆటోలు బోల్తా పడి..
చిల్లకూరు : ఆటోలు బోల్తా పడి పలువురు ప్రయాణికులు గాయపడిన ఘటనలు సోమవారం చిల్లకూరు, కోట మండలాల్లో వెలుగుచూశాయి. ఇందులో సైదాపురం మండలం కృష్ణారెడ్డిపల్లె గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు ఆటోలో గూడూరుకు వస్తున్నారు. ఈ క్రమంలో తిప్పవరప్పాడు సమీపంలోకి వచ్చే సరికే ఆటో ముందు టైర్ పగలడంతో డ్రైవర్ ఆటోను అదుపు చేయలేకపోవడంతో బోల్తా పడింది. అయితే ఆటోలో ఉన్న ఇద్దరు, డ్రైవర్ ఆటోలో ఇరుక్కు పోవడంతో అటుగా వెళ్లే వారు వారిని బయటకు తీసి మరో ఆటోలో గూడూరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ విషయమై తమకు ఎలాంటి సమాచారం అందలేదని గూడూరురూరల్ పోలీసులు తెలిపారు.
కోటలో..
కోట: మండలంలోని ఉత్తమ నెల్లూరు గ్రామం మలుపు వద్ద సోమవారం ఆటో బోల్తాపడిన ప్రమాదంలో పలువురు గాయపడ్డారు. గోవిందపల్లి నుంచి కోటకు ప్రయాణికులతో వస్తున్న ఆటో ఎదురుగా వస్తున్న మరో ఆటోను ఢీకొని పొలాల్లోకి దూసుకెళ్లి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న ఆరుగురికి గాయాలయ్యాయి. 108 సిబ్బంది వారిని గూడూరు ఏరియా హాస్పిటల్‌కు తరలించారు. వారిలో సుప్రియ అనే మహిళకు తీవ్రగాయాలైనట్లు తెలిపారు.