
కౌలు రైతులకు అన్యాయం చేస్తే ఊరుకోం
వాకాడు : దేవదాయ శాఖ అధికారులు నిబంధనలకు వ్యవహరిస్తూ రైతులకు అన్యాయం చేస్తే ఊరుకోమని వైఎస్సార్‌సీపీ వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి హెచ్చరించారు. సోమవారం వాకాడుకు చెందిన పలువురు కౌలు రైతులు ఆయనను కలిసి వాకాడు నాగేశ్వరస్వామి, అలఘనాథస్వామి, కోదండరామస్వామి ఆలయ భూముల కౌలు వేలాన్ని అధికారులు ఇష్టానుసారం నిర్వహిస్తున్నారని మొర పెట్టుకున్నారు. ఈ విషయమై రామ్‌కుమార్‌రెడ్డి స్పందిస్తూ రైతుల పక్షాన నిలబడి పోరాటం చేస్తామని భరోసా ఇచ్చారు. ఆలయ భూముల కౌలు వేలం నిర్వహించే తీరు అధికారులకు తెలియకపోతే నెల్లూరుకు చెందిన ఆ శాఖ మంత్రిని అడిగి తెలుసుకోవాలని హితవు పలికారు. మూడు ఆలయాలకు సంబంధించి 96 ఎకరాలు ఉండగా అందులో కేవలం 25 ఎకరాలకు మాత్రమే కౌలు వేలంపాట నిర్వహించడం వెనుక ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. మండలంలోని పంట్రంగం గ్రామంలో వెలసిన శ్రీ పాండురంగేశ్వర స్వామి ఆలయానికి సంబంధించి రూ.17 లక్షలు గోల్‌మాల్ జరిగితే వారిపై కూటమి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుందో చెప్పాలన్నారు. కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, కౌలురైతులు, పాల్గొన్నారు.