
వీసీ..పేచీ!
గాడితప్పిన వర్సిటీల పాలన
వీసీల నియామకాల్లో తీవ్ర జాప్యం
విద్యార్థుల భవితవ్యం.. అగమ్యగోచరం
తిరుపతి సిటీ: కూటమి ప్రభుత్వం విద్యారంగాన్ని భ్రష్టుపట్టిస్తోంది. అవగాహన లేకనో.. విద్యారంగాన్ని ప్రైవేటు పరం చేయాలనే కుట్రతోనో వర్సిటీలపై దృష్టి సారించకుండా నిర్లక్ష్యం చేస్తోంది. తిరుపతి, చిత్తూరు జిల్లాల్లోని వర్సిటీలకు పూర్తి స్థాయి వీసీల నియామకాలను చేపట్టకుండా శోద్యం చూస్తోంది. వర్సిటీలలో పాలన స్తంభించి పోతోంది. నియామకాలు, బదిలీల విషయంలో తాత్కాలిక వీసీలు తమ అనుచరులకు పేద్దపీట వేశారు. అధికార పార్టీకి చెందిన నాయకుల ఒత్తిడితో వర్సిటీలను నడిపిస్తూ అరాచకాలకు పాల్పడుతున్నారు. దీంతో వర్సిటీల భవితవ్యం ఆగమ్య గోచరంగా మారింది.
చేతులెత్తేసిన కూటమి
జిల్లాలోని ఎస్వీయూనివర్సిటీ, ద్రావిడ వర్సిటీ, ఎస్వీ వెటర్నరీ వర్సిటీలకు సంబంధించి వీసీల నియామకంలో కూటమి ప్రభుత్వం చేస్తున్న హడావుడి ఇంతా అంతా కాదు. గత ప్రభుత్వంలో నియమితులైన వీసీలను బలవంతంగా ఒత్తిడి తెచ్చి రాజీనామలను చేయించారు. ఆ తర్వాత మంత్రి లోకేష్ ఇప్పటి వరకు జిల్లాలోని పలు వర్సిటీలకు వీసీలను నియమించలేకపోయారు.
నిగ్గుతేల్చని వైనం
జిల్లాలోని ఎస్వీయూ, ద్రావిడ వర్సిటీలకు వీసీల నియామకాలకు సంబంధించి మంత్రి లోకేష్ ఇప్పటికే సుమారు మూడు సార్లు సెర్చ్ కమిటీలను నియమించి విఫలమయ్యారు. గత 20 నెలల నుంచి జిల్లాలోని పలు వర్సిటీలకు ఇన్‌చార్జిలను నియమించి కాలయాపన చేస్తూ వస్తున్నారు. ఇందులో ప్రధానంగా జనసేన, టీడీపీకి చెందిన సామాజిక వర్గాల అధ్యాపకులు పెద్ద ఎత్తున ఆయా పార్టీల అధినేతలో మంత్రి లోకేష్‌కు ఒత్తిడి తేవడంతో సెర్చ్ కమిటీలు సైతం చేతులెత్తేశాయి. ఇప్పటికీ మూడు సార్లు జిల్లాలోని యూనివర్సిటీలకు వీసీలను నియమించేందుకు ఏర్పాటు చేసిన కమిటీలు తమ వల్ల కాదంటూ చేతులేత్తేశాయి. దీంతో ఇప్పటి వరకు ఆ దిశగా మంత్రితో పాటు ఉన్నత విద్యామండలి అధికారులు అడుగులు వేయాలంటే భయపడుతున్నారు.
మొగ్గు చూపని ఎన్‌ఐటీ, ఐఐటీ నిపుణులు
జిల్లాలోని ఎస్వీయూ, వెటర్నరీ, ద్రావిడ వర్సిటీలకు సంబంధించి వీసీ నియామకాలను సంబంధించి కూటమి ప్రభుత్వం ఎన్‌ఐటీ, ఐఐటీ అధికారులను నియమించాలని ప్రయత్నం చేసింది. ఇప్పటికే రాష్ట్రంలోని పలు వర్సిటీలకు ఆ దిశగా నియామకాలు చేపట్టింది. కానీ ఆ యూనివర్సిటీలలో నియమితులైన ఐఐటీ, ఎన్‌ఐటీ నిపుణులకు వర్సిటీలపై పూర్తి స్థాయి అవగాహన లేకపోవడంతో తమను ఆ విధుల నుంచి తప్పించాలని వారు విద్యాశాఖా మంత్రిని, ఉన్నత విద్యామండలికి విన్నవించారు. దీంతో ఎస్వీయూ వంటి ప్రతిష్టాత్మకవర్సిటీలకు వీసీ నియామకం విషయంలో ఎటూ తేల్చుకోలిని స్థితిలో కాలక్షేపం చేస్తోంది.
ఎస్వీయూలో పరిస్థితి దారుణం
ఎస్వీయూలో పాలన పూర్తిగా స్తంభించిపోయింది. పూర్తి స్థాయి వీసీని నియమించకపోవడంతో పాటు ప్రస్తుత ఇన్‌చార్జి వీసీకి రిజిస్ట్రార్‌కు పలు విషయాలలో విభేదాలు నెలకొనడంతో పాలన గాడితప్పింది. పాలన పూర్తిగా ఉన్నత విద్యామండలి చేతులోకి వెల్లింది. ప్రతి చిన్న విషయానికి ఉన్నత విద్యామండలి జోక్యం చేసుకుంటోంది. 2025 పీజీ సెట్ అడ్మిషన్ల విషయంలో కనీసం ఇప్పటి వరకు అన్ని విభాగాలలో 30శాతం అడ్మిషన్లు కాకపోవడం ఆలోచించాల్సి విషయం.
ఉన్నత విద్య నిర్వీర్యం
నిర్వీర్యం చేసే ప్రయత్నమే
కూటమి ప్రభుత్వం విద్యావ్యవస్థను నిర్వీర్యం చేస్తోంది. ఇంటర్, డిగ్రీ, పీజీ అడ్మిషన్లు కనీ సం 30శాతం సైతం ప్రభుత్వ సంస్థలలో ప్రవేశాలు కావడం లేదు. దీనికి తోడు వర్సిటీలలో పాలన పూర్తిగా స్తంభించింది. ఇప్పటి వరకు ఎస్వీయూకు పూర్తి స్థాయి అధికారులు లేరు. ఇన్‌చార్జి పాలనతో కాలయాపన చేస్తున్నారు. ప్రైవేటు వ్యక్తులకు వర్సిటీలను అప్పజెప్పే ప్రయత్నం చేస్తే ఊరుకోం. –బండి చలపతి,
ఏఐఎస్‌ఎఫ్, రాష్ట్ర సహాయ కార్యదర్శి, తిరుపతి