
స్విమ్స్‌లో ఘనంగా వరల్డ్ హార్ట్ డే
తిరుపతి తుడా : స్విమ్స్ కార్డియాలజీ విభాగం ఆధ్వర్యంలో వరల్డ్ హార్ట్‌డే ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కార్డియాలజీ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఉషారాణి మాట్లాడుతూ.. బీపీని కంట్రోల్‌లో ఉంచుకోవడం వల్ల స్ట్రోక్, పక్షవాతం లాంటివి తగ్గించుకోవచ్చన్నారు. ప్రతి రోజు ఉదయం 20 నిమిషాల పాటు వ్యాయామం చేయడం వల్ల బీపిని అదుపులో ఉంచుకోవచ్చునని తెలిపారు. అధికంగా మందులు వాడటం వల్ల కిడ్ని సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని, సోడియం తక్కువగా ఉండే ఆహార పదార్థాలు తీసుకోవాలని సూచించారు. అధిక బరువును నియంత్రించుకోకపోతే అధిక రక్తపోటుకు గురికావాల్సి వస్తుందని హెచ్చరించారు. అనంతరం రోగులకు పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో విభాగాధిపతి డాక్టర్ రాజశేఖర్, డాక్టర్ అనిల్, డాక్టర్‌వాహిద్ ఖాన్, డాక్టర్ రోహిత్, డాక్టర్ ఉపేంద్ర, హరీష్ చౌదరి, వైద్యులు పాల్గొన్నారు.
ప్రజా ఫిర్యాదుల
పరిష్కార వేదిక నేడు
తిరుపతి తుడా: నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం, 10.30 నుంచి 11.30 గంటల వరకు డయల్ యువర్ కమిషనర్ కార్యక్రమం నిర్వహించనున్నట్టు కమిషనర్ ఎన్ మౌర్య తెలిపారు. ఫోన్ ద్వారా ఫిర్యాదు చేసేవారు 0877–2227208కి కాల్ చేయాలని తెలిపారు. నేరుగా కార్యాలయంలో అధికారులకు వినతులు అందజేయవచ్చని వెల్లడించారు.
లారీని ఢీకొన్న బైక్
నాయుడుపేటటౌన్:మండల పరిధిలోని అయ్యప్పరెడ్డి పాళెం సమీపంలో జాతీయ రహదారిపై ఆదివారం సాయంత్రం లారీని బైక్ వేగంగా వెళ్లి ఢీకొంది. ఈ ప్రమాదంలో మండల పరిధిలో ని పండ్లూరు గ్రామానికి చెందిన బైక్ నడుపుతున్న వెంకట చందు(26) అనే యువకుడు మృతి చెందాడు. అదే గ్రామానికి చెందిన తిరుమల అనే యువకుడు తీవ్రంగా గాయపడగా పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు తెలిపిన మేరకు వివరాలు. పండ్లూరు గ్రామానికి చెందిన వెంకట చందు, తిరుమల, కృష్ణతేజ అనే ముగ్గురు యువకులు అయ్యప్పరెడ్డి పాళెం గ్రామ సమీపంలో నది లో చేపలు పట్టేందుకు వెళ్లారు. తిరిగి సాయంత్రం బైక్ పై పండ్లూరు గ్రామానికి వస్తూ అయ్యప్పరెడ్డిపాళెం వద్ద ముందు వెళుతున్న లారీను వీరి బైక్ ఢీకొంది. బైక్ నడుపుతూ తీవ్రంగా గాయపడిన వెంకట చందు అక్కడిక్కడే మృత్యువాత పడ్డాడు. వెనుక కూర్చుని ఉన్న తిరుమల తీవ్రంగా గాయపడ్డాడు. వీరిద్దరి వెనుక కూర్చున్న కృష్ణతేజ మాత్రం ప్రమాదం నుంచి బయట పడ్డాడు. సీఐ బాబి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

స్విమ్స్‌లో ఘనంగా వరల్డ్ హార్ట్ డే