
జాబ్ మేళా రేపు
తిరుపతి అర్బన్: తిరుపతి రూరల్ మండలం వేదాంతపురంలోని డాక్టర్ ఆర్సీ రెడ్డి డిగ్రీ కళాశాలలో శనివారం జాబ్ మేళా నిర్వహిస్తున్నా మని జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఆర్.లోకనాథం గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 8 గంటల నుంచి మేళా ప్రారంభం అవుతుందన్నారు. తిరుపతి నగరంతోపాటు ఈఎంసీ క్లస్టర్, శ్రీసిటీ, చైన్నెలోని పలు కంపెనీలకు చెందిన ప్రతినిధులు జాబ్ మేళాలో పాల్గొంటారని చెప్పారు. ఇంటర్వ్యూలకు వచ్చే యువతీయువకులు శుక్రవారం రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. నైపుణ్యం.ఏపీ.జీవోవీ వెబ్‌సైట్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకునే సౌకర్యం ఉందని తెలిపారు. అదనపు సమాచారం కోసం 7013509543, 9988853335 నెంబర్లను సంప్రదించాలని సూచించారు.
బీఎన్‌కండ్రిగ ఏఎంసీ చైర్మన్ రిజర్వేషన్ మార్పుపై స్టే
వరదయ్యపాళెం: బీఎన్‌కండ్రిగ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవికి సంబంధించి రిజర్వేషన్ మార్పు చేసిన ప్రభుత్వ చర్యలను వ్యతిరేకిస్తూ హైకోర్టు స్టే విధించింది. ఈ విషయమై హైకోర్టును ఆశ్రయించిన గిరిజన రైతు వై.సురేంద్ర ఈ వివరా లను వెల్లడించారు. బీఎన్‌కండ్రిగ మార్కెట్ కమి టీ చైర్మన్ పదవిని గిరిజన విభాగానికి రిజర్వ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయి తే ఆ రిజర్వేషన్‌ను కూటమి పెద్దల సహకారంతో మార్పు చేసి, జనరల్ మహిళకు కేటాయించారు. ఆ మేరకు బీఎన్‌కండ్రిగ మండలానికి చెందిన టీడీపీ అధ్యక్షుడు సుధాకర్ నాయుడు సతీమణి మావిళ్లపల్లి జ్యోతిని చైర్మన్‌గా నియమిస్తూ ఇటీవల ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఈ ప్రక్రియను వ్యతిరేకిస్తూ కేవీబీపురం మండలం కోవనూరు గ్రామానికి చెందిన గిరిజన రైతు వై.సురేంద్ర హైకోర్టును ఆశ్రయించి గిరిజన రిజర్వేషన్ మార్పుపై అభ్యంతరం వ్యక్తం చేయడంతో దీనిపై స్పందించిన హైకోర్టు రిజర్వేషన్ మార్పు విధానాన్ని తప్పుపడుతూ స్టే విధించినట్లు ఆయన తెలిపారు.
సబ్సిడీ రుణాలు
సద్వినియోగం చేసుకోండి
రేణిగుంట: పీఎంఎఫ్‌ఎంఈ పథకం ద్వారా రూ.10 లక్షల సబ్సిడీతో ఏర్పాటు చేసిన అప్పడాల తయారీ ఫ్యాక్టరీని గురువారం ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ చిన్న రెడ్డెయ్య ప్రారంభించారు. అలాగే రూ.30 లక్షల రుణం అందజేశారు. ఈ సందర్భంగా ఈడీ మాట్లాడుతూ యువతీ,యువకులు ప్రభుత్వ సబ్సిడీ రుణాలను వినియోగించుకోవాలన్నారు. కొత్త వ్యాపారాలు ప్రారంభించి, మరికొందరికి ఉపాధి కల్పించాలి అని సూచించారు.