
వైద్యవిద్యపై బాబు విద్వేషం
తిరుపతి మంగళం : పేద విద్యార్థులను వైద్యవిద్యకు దూరం చేసేలా చంద్రబాబు విద్వేషపూరితంగా పాలన సాగిస్తున్నారని వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం అధ్యక్షులు, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి మండిపడ్డారు. సోమవారం తిరుపతిలో ఆమె మీడియాతో మాట్లాడారు. ఐదేళ్ల జగనన్న పాలనలో విద్య, వైద్యానికి పెద్దపీట వేశారన్నారు. నాడు–నేడు కింద ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్‌కు దీటుగా అభివృద్ధి చేశారని వెల్లడించారు. పేద బిడ్డలు సైతం వైద్యవిద్యను అభ్యసించాలనే మహోన్నత ఆశయంతో రాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా 17 మెడికల్ కళాశాలలను నిర్మించారని కొనియాడారు. అయితే రాజకీయ కక్షతో కూటమి ప్రభుత్వం వైద్య కాలేజీలను ప్రైవేటు పరం చేసేందుకు తెగబడిందని ఆవేదన వ్యక్తం చేశారు. పేద విద్యార్థుల ఆశలను అడియాసలు చేయడం దారుణమని మండిపడ్డారు. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో ఒక మెడికల్ కళాశాల ఏర్పాటుకు జగనన్న చేసిన కృషి ఫలించకుండా చంద్రబాబు రాహువులా అడ్డుపడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగనన్న పాలనలో రూ.3లక్షల కోట్లను సంక్షేమ పథకాల రూపంలో ప్రజలకు అందించారన్నారు. అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర గడిచినా చంద్రబాబు చేసిన మేలు ఏంటో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. కీలుబొమ్మ హోంమంత్రి అనితకు దమ్ముంటే ఆమె పక్క జిల్లాలోని పాడేరు మెడికల్ కళాశాల, ఇన్‌చార్జి మంత్రిగా ఉన్న విజయనగరం జిల్లాలోని మెడికల్ కళాశాల వద్దకు రావాలని సవాల్ విసిరారు. మెడికల్ కళాశాలలు ప్రైవేటు వరం కాకుండా జగనన్న సారథ్యంలో అడ్డుకుంటామని స్పష్టం చేశారు. బద్వేలు ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధ మాట్లాడుతూ జగనన్న నిర్మించిన మెడికల్ కళాశాలలను ప్రైవేట్‌కు కట్టబెట్టాలని చూడడం దారుణమన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 2,600 మెడికల్ సీట్లు ఉన్నాయని, ఈ 17 మెడికల్ కళాశాలలు పూర్తయితే..4వేలకు పైగా సీట్లు అందుబాటులోకి వస్తాయని వెల్లడించారు.