
డేటా సైన్స్ సెంటర్‌లో ముగిసిన సదస్సు
తిరుపతి రూరల్ : మండలంలోని తుమ్మలగుంట పంచాయతీలో నూతనంగా ఏర్పాటు చేసిన డేటా సైన్స్ సెంటర్‌లో ఐదు రోజులుగా నిర్వహిస్తున్న జాతీయ స్థాయి సదస్సు ఆదివారంతో ముగిసింది. ‘‘స్టాటిస్టికల్ లెర్నింగ్ అండ్ డేటా సైన్స్ – ఫౌండేషన్స్ అండ్ అప్లికేషన్స్’’ పేరిట చేపట్టిన సదస్సును మహిళా వర్సిటీ, ఇండియన్ సొసైటీ ఫర్ ప్రాబబిలిటీ అండ్ స్టాటిస్టిక్స్ (ఐఎస్‌పీఎస్), ఎస్వీయూ సంయుక్తంగా నిర్వహించాయి. ముందుగా ఎస్వీయూ ప్రొఫెసర్ ఎంపీశాస్త్రి జయంతిని పురస్కరించుకుని నివాళులర్పించారు. సదస్సు నిర్వాహక కార్యదర్శి డాక్టర్ ఎం.శివ పార్వతి మాట్లాడుతూ వివరణాత్మక నివేదికను సమర్పించారు. స్టాటిస్టికల్ సైన్స్ మౌలికాలు, మెషిన్ లెర్నింగ్, డేటా మైనింగ్, సిగ్నల్ ప్రాసెసింగ్, ఎన్ట్రోపీ, యాక్చూరియల్ సైన్స్, నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్, పోర్ట్‌ఫోలియో ఆప్టిమైజేషన్, ఏఐ అంతరశాఖ అనువర్తనాలు వంటి విస్తృత అంశాలను చర్చించినట్టు వివరించారు. ఈ సదస్సులో పాల్గొన్న వారికి సర్టిఫికెట్లు పంపిణీ చేశారు. కస్టమ్స్ అండ్ జీఎస్‌టీ అసిస్టెంట్ కమీషనర్ సి.విజయభాస్కర్, డైరెక్టర్ ఆఫ్ ప్లానింగ్, స్టాటిస్టిక్స్ ఎవాల్యుయేషన్ మాజీ జాయింట్ డైరెక్టర్ వై. దుర్గా ప్రసాద్, ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టికల్ సర్వీసెస్ మాజీ డైరెక్టర్ కల్లూరి నాగేశ్వరరావు, పాండిచ్చేరి యూనివర్సిటీ ప్రొఫెసర్ ఆఫ్ స్టాటిస్టిక్స్‌ఆర్. విష్ణువర్ధన్ , హిమాచల్ ప్రదేశ్ ఐఐటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ గణేష్ తలారి పాల్గొన్నారు.