
పట్టాభూమినే కొట్టేశారు!
రైతుకు తెలియకుండానే టీడీపీ నేతకు కట్టబెట్టిన అధికారులు కేవీబీపురంలో రెవెన్యూ అధికారుల బాగోతం గగ్గోలు పెడుతున్న బాధిత రైతు
కేవీబీపురం : కేవీబీపురం రెవెన్యూ అధికారుల అవినీతి బాగోతం మరోసారి బట్టబయలైంది. వేరొకరి నుంచి కొనుగోలు చేసి, సుమారు 35 ఏళ్లుగా సాగు చేసుకుంటున్న పట్టా భూమిని రెవెన్యూ అధికారులు ఆ రైతుకు తెలియకుండా, అతడి ప్రమేయం లేకుండా అదే గ్రామానికి చెందిన ఓ టీడీపీ నేతకు ఆన్‌లైన్‌లో హక్కు కల్పించారు. అది కూడా కేవలం 42 రోజుల వ్యవధిలోనే ఇవ్వడం గమనార్హం. ఇది మొత్తం వీఆర్‌ఓ , తహసీల్దార్ చేశారని బాధిత రైతు ఆరోపిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. మండలంలోని తిమ్మసముద్రం గ్రామానికి చెందిన రమణయ్య నాయుడు అదే గ్రామ రెవెన్యూలోని సర్వే నంబర్ 15లో సుమారు 1.2 ఎకరాల వ్యవసాయ భూమిలో కొంత కొనుగోలు, కొంత వారసత్వం ద్వారా పొందాడు. ఇదే భూమిలో సుమారు 35 ఏళ్లుగా సాగులో ఉన్నాడు. అయితే ఈ భూమిపై కన్నేసిన స్థానిక ఓ టీడీపీ నేత ఆ భూమిని కాజేసేందుకు పావులు కదిపాడు. స్థానిక వీఆర్‌ఓ అందుకు సహకరించడంతో పాసు పుస్తకం కలిగి ఉన్న లబ్ధిదారుడికి తెలియకుండానే వీఆర్‌ఓ ఆయా సర్వే నంబర్లకు తహసీల్దార్ కార్యాలయం నుంచే మ్యుటేషన్ కట్టించి, మండల ఆర్‌ఐల ప్రమేయం లేకుండానే తహసీల్దార్‌కు ఫైల్ అందించారు. దీంతో కేవలం రోజుల వ్యవధిలోనే రమణయ్యనాయుడు భూమిని శ్రీనివాసుల నాయుడు పేరుపైకి మార్చేశారు. ఇదే భూమిపై రమణయ్య క్రాప్ లోన్ కలిగి ఉండడంతో బ్యాంకుకు వెళ్లడంతో ఈ బాగోతం బయటపడింది. దీనిపై మండల అధికారులను కలిసి తనకు జరిగిన అన్యాయంపై వివరించారు. అయినప్పటికీ అధికారులు కాలయాపన చేస్తుండడంతో బాధిత రైతు మీడియాను ఆశ్రయించి న్యాయం చేయాలని వేడుకుంటున్నాడు.