
ఉచిత బస్సా..మజాకా!
● కండక్టర్, డ్రైవర్‌ను వేడుకున్నా నిలపని వైనం ● బస్సు దిగి 2 కి.మీ నడుచుకుంటూ ఊరికి వెళ్లిన మహిళ
చిల్లకూరు : ఆర్టీసీలో మహిళలకు ప్రభుత్వం ఉచిత ప్రయాణం ఏర్పాటు చేసింది. అయితే ఎక్స్‌ప్రెస్ బస్సులో ఎక్కిన మహిళలకు వారు దిగాల్సిన స్టేజీలో కాకుండా ఎంపిక చేసిన స్టేజీలోనే బస్సును నిలుపుతున్నారు. దీంతో మంగళవారం ఓ మహిళ బస్సు దిగి తన గ్రామానికి 2 కి.మీ. దూరం నడిచి వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడింది. గూడూరు మండలం నెర్నూరుకు చెందిన విజయమ్మ వెంకటగిరి డిపో బస్సు గూడూరులో ఎక్కి నెర్నూరుకు టికెట్ తీసుకుంది. స్టేజీ వచ్చిన సమయంలో డ్రైవర్‌కు తాను దిగాలని కోరితే పక్క స్టేజీలో నిలుపుతామని చెప్పి వేగంగా బస్సును తీసుకుని వెళ్లాడు. దీంతో ఆమె బస్సు దిగి తన ఊరికి సుమారు 2.కి.మీ దూరం నడిచి వెళ్లాల్సి వచ్చింది. ఉచిత బస్సు ఎక్కి ప్రయాణం చేస్తే రెండు కి.మీ నడిపించారని ఉచితం అంటే ఇలానే ఉంటుందా అని మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. మహిళలు తాము ఎక్కడి దిగాలని అనుకుంటారో అక్కడే నిలిపేలా అధికారులు చర్యలు తీసుకోవాలని మహిళలు కోరుతున్నారు.
నేడు పోలేరమ్మతల్లి
జాతర రెండో చాటింపు
వెంకటగిరి రూరల్ : పోలేరమ్మ తల్లి జాతరకు సంబంధించి బుధవారం రెండో చాటింపు నిర్వహించనున్నారు. కాంపాళెంలోని కామాక్షమ్మ ఆలయం నుంచి పట్టణ పుర వీధుల్లో చాటింపు నిర్వహించనున్నారు. 7న ఘటోత్సవం, 10న అమ్మవారి ఉత్సవం, 11న నిలుపు, నగరోత్సవం, నిష్రమణం జరగనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.