
ఔషధ నియంత్రణ అధికారుల దాడులు
తిరపతి తుడా : తిరుచానూరులోని పద్మావతి ఇంటిగ్రేటెడ్ పోలీ హాస్పిటల్ ప్రాంగణంలోని శ్రీ పద్మావతి ఫార్మసీపై ఔషధ నియంత్రణ అధికారులు బుధవారం దాడులు నిర్వహించారు. ఫార్మసీలో అబార్షన్ మందులు, సరైన కొనుగోలు రికార్డులు లేకుండా పలు రకాల ఔషధాలు నిల్వ చేసి విక్రయిస్తున్నట్లు గుర్తించారు. ఈ సందర్భంగా కేసు నమోదు చేశారు. దీంతో పాటు తదుపరి విచారణలో డాక్టర్ శైలజ (హోమియోపతి వైద్యురాలు) తన వద్దకు వచ్చిన రోగులపై అబార్షన్ మందులను దుర్వినియోగం చేస్తున్నట్లు తెలిపారు. ఈ విషయం పై పూర్తి స్థాయి విచారణ చేసేందుకు రంగం సిద్ధం చేశారు. దాడి సమయంలో 15 ఇన్వాయిస్‌లు, 18 రకాల మందులు కొనుగోలు ఇన్వాయిస్ లేకుండా నిల్వ ఉంచిన వాటిని స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడుల్లో డ్రగ్స్ కంట్రోల్ అసిస్టెంట్ డైరెక్టర్ సీహెచ్ హరిప్రసాద్, తిరుపతి గ్రామీణ డ్రగ్స్ ఇన్‌స్పెక్టర్లు, పోలీసులు పాల్గొన్నారు.