
● వార్తలు రాస్తే కేసులా? ● పోలీసులకు జరిగిన అన్యాయాన్ని
తిరుపతి అర్బన్ : ఇదేమి రాజ్యం.. పత్రికల్లో వార్తలు ప్రచురిస్తే కేసులు పెట్టి.. జర్నలిస్టులను భయపెట్టడం ఎంటీ సార్.. రాష్ట్ర చరిత్రలో ఓ వార్త ప్రచురించారని ఏకంగా ఎడిటర్‌పై కేసు పెట్టడం ఇప్పటివరకు జరగలేదు అంటూ తిరుపతి పాత్రికేయులు కూటమి ప్రభుత్వం వ్యవహారంపై తీవ్రమైన అసంతృప్తి వ్యక్తంచేశారు. పోలీస్ విభాగానికి సంబంధించి డీఎస్పీల పదోన్నతి అంశంలో జరుగుతున్న లోటుపాట్లతో పోలీస్ అధికారులకు జరుగుతున్న అన్యాయాన్ని సాక్షి పత్రికలో ఓ కథనం ప్రచురిస్తే.. అదే పోలీస్‌లతో అర్ధరాత్రి సమయంలో విచారణ చేపట్టడంతో పాటు ఏకంగా సాక్షి ఎడిటర్ ఆర్. ధనంజయరెడ్డితో పాటు సాక్షి పాత్రికేయులపై కేసులు పెట్టడంపై పాత్రికేయ సంఘాలు మండిపడ్డాయి. ఆ మేరకు బుధవారం తిరుపతి ఈస్ట్ పోలీస్‌స్టేషన్ వద్ద పలు సంఘాల ప్రతినిధులు అక్రమ కేసులకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు. జర్నలిస్టుల వృత్తి సమాజంలో జరుగుతున్న మంచితోపాటు చెడును తెలియజేయడం ద్వారా అధికార యంత్రాంగం తప్పులను సరిదిద్దుకునే అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో పత్రికలు పనిచేస్తున్నాయని సంఘాల నేతలు గుర్తు చేశారు. అయితే ప్రభుత్వ ఆలోచన మాత్రం దురుద్దేశపూర్వకంగా ఉందని విమర్శించారు. తప్పిదాలు చోటు చేసుకున్నా, అవినీతి అక్రమాలు కొనసాగుతున్న వాటిని ప్రజలకు తెలియజేయకుండా... తప్పొప్పులతో సంబంధం లేకుండా ప్రభుత్వానికి భజన చేయాలని భావించడం మంచి పద్ధతి కాదని హితవు పలికారు. మీడియాపై కక్ష సాధింపులకు పాల్పడిన ఏ ప్రభుత్వానికి మనుగడ లేకుండా పోయిందని హెచ్చరించారు. సాక్షి ఎడిటర్‌పై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే పెద్ద ఎత్తున పోరాటాలు చేయాల్సి వస్తుందని స్పష్టం చేశారు. అనంతరం ఈస్ట్ పోలీస్‌స్టేషన్ సీఐ శ్రీనివాసులకు అక్రమ కేసుల అంశాన్ని వివరించారు. పోలీసులకు మద్దతుగా కథనాలు రాస్తే.. అదే పోలీసును ఎడిటర్‌పై కేసులు పెట్టడం న్యాయమా అని ప్రశ్నించారు. ఆ మేరకు ఓ వినతిపత్రాన్ని ఆయనకు అందించారు. ఈ కార్యక్రమంలో సాక్షి పత్రిక బృందంతో పాటు తిరుపతి ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడు ఆర్.మురళి, కార్యదర్శి పి.బాలచంద్ర, ఏపీ ఫొటో జర్నలిస్టు అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కే.గిరిబాబు, ఏపీ మీడియా ఫెడరేషన్ రాష్ట్ర కో ఆర్డినేటర్ కల్లుపల్లి సురేంద్రరెడ్డి, ఏపీయూడబ్ల్యూజే కార్యవర్గ సభ్యుడు మబ్బు నారాయణరెడ్డి, జర్నలిస్ట్ సంఘం నేతలు హేమంత్, ప్రసాద్ మోహన్, సుబ్రమణ్యం, చంద్రాగౌడ్ తదితరులు పాల్గొన్నారు.

● వార్తలు రాస్తే కేసులా? ● పోలీసులకు జరిగిన అన్యాయాన్ని