
జాతర ఏర్పాట్లపై దిశా నిర్దేశం
వెంకటగిరి (సైదాపురం) : ప్రసిద్ధి చెందిన వెంకటగిరి శక్తి స్వరూపిణి పోలేరమ్మతల్లి జాతర ఏర్పాట్లపై బుధవారం అధికారులకు జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ దిశానిర్దేశం చేశారు.ఈనెల 10, 11 తేదీలలో వెంకటగిరిలో జరగనున్న పోలేరమ్మ జాతర మహోత్సవానికి సంబంధించి పట్టణంలో పలు శాఖల అధికారులతో సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెంకటేశ్వర్ మాట్లాడుతూ.. పోలేరమ్మ జాతరకు ప్రభుత్వం ప్రత్యేకంగా రూ. 40 లక్షలు నిధులు మంజూరు చేసిందన్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా సమర్థవంతంగా నిర్వర్తించాలని సూచించారు. మహిళలకు అసౌకర్యం కలగకుండా ఆర్టీసీ అధికారులు ప్రత్యేక చొరవ తీసుకోవాలని సూచించారు. జాతర విజయవంతం అయ్యేందుకు గూడూరు సబ్ కలెక్టర్ రాఘవేంద్రమీన ప్రత్యేక బాధ్యత తీసుకుంటారన్నారు. గత పొరపాట్లు పునరావృతం కాకుండా నిర్వహణ గత ఏడాది జరిగిన పోలేరమ్మ జాతరలో పొరపాట్లు పునరావృతం కాకుండా ఈ ఏడాది సమర్థవంతంగా పోలీసు బందోబస్తు ఏర్పాట్లను చేస్తున్నట్లు ఎస్పీ హర్షవర్ధన్‌రాజు తెలిపారు. పట్టణంలో సీసీ కెమెరాలు, డ్రోన్‌లతో కంట్రోల్ రూం ఏర్పాటు చేసి నిఘా ఉంచనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ మాట్లాడుతూ.. ఈ ఏడాది వీఐపీ దర్శన క్యూలైన్లు రద్దు చేస్తున్నట్లు వివరించారు. అనంతరం అమ్మవారి జాతరకు సంబంధించి గోడపత్రికలను ఆవిష్కరించారు. కార్యక్రమంలో డీఎస్పీ గీతాకుమారి, మున్సిపల్ చైర్‌పర్సన్ భానుప్రియ, పలుశాఖల అధికారులు పాల్గొన్నారు.
కల్యాణ మండపానికి రూ.1.65 కోట్లు మంజూరు
వెంకటగిరి రూరల్ : వెంకటగిరి పోలేరమ్మతల్లికి సంబంధించి ఆలయ పరిపాలన భవనం, కల్యాణ మండపం, వాణిజ్య సముదాయానికి సంబంధించి రూ. 1.65 కోట్ల నిధులు మంజూరైనట్లు కలెక్టర్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. పట్టణంలోని పీవీ మెస్ పక్కన ఉన్న స్థలాన్ని బుధవారం స్ధానిక ఎమ్మెల్యే, దేవాదాయశాఖ , మున్సిపల్, రెవెన్యూ అధికారులతో కలిసి పరిశీలించారు. వెంకటగిరి పోలేరమ్మతల్లికి సంబంధించి పట్టణంలో కమర్షియల్ కాంప్లెక్స్, కళ్యాణ మండపం, పరిపాలన భవనం నిర్మాణానికి దేవాదాయశాఖ నుంచి రూ. 1.10 కోట్లు , పోలేరమ్మతల్లి దేవస్థానం నుంచి రూ. 40 లక్షలు నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ, సబ్‌కలెక్టర్ రాఘవేంద్రమీన, తహసీల్దార్ నరసింహారావు, మున్సిపల్ కమిషనర్ వెంకటరామిరెడ్డి పాల్గొన్నారు.
పోలేరమ్మతల్లి జాతర రెండో చాటింపు
వెంకటగిరి రూరల్ : వెంకటగిరి శ్రీ పోలేరమ్మతల్లి జాతర సందర్భంగా బుధవారం అర్ధరాత్రి దేవాదాయశాఖ అధికారులు , అమ్మవారి సేవకుల సమక్షంలో పట్టణంలోని కాంపాళెం కామాక్షమ్మ గుడి వద్ద రెండో చాటింపు వైభవంగా జరిగింది. అమ్మవారి జాతర వచ్చే బుధవారం జరుగుతుందంటూ తప్పెట్లు, కిలారింపు అరుపులతో కోలాహలంగా నిర్వహించారు.