‘సాక్షి’ ఎడిటర్‌పై కేసు అప్రజాస్వామికం! | - | Sakshi
Sakshi News home page

‘సాక్షి’ ఎడిటర్‌పై కేసు అప్రజాస్వామికం!

Sep 3 2025 5:12 AM | Updated on Sep 3 2025 5:12 AM

‘సాక్

‘సాక్షి’ ఎడిటర్‌పై కేసు అప్రజాస్వామికం!

● చిత్తూరులో ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో ప్రెస్‌క్లబ్‌ సభ్యుల నిరసన ● పత్రికా స్వేచ్ఛను కాపాడాలని నినదించిన జర్నలిస్టులు ● పోలీసులకు వినతి పత్రం అందచేసిన పాత్రికేయులు

చిత్తూరు అర్బన్‌: అధికారులకు అనుకూలంగా పత్రికల్లో వార్త రాయకుంటే కేసులు పెట్టడం ఎంత వరకు సమంజసమని పాత్రికేయులు ప్రశ్నించారు. పత్రికల్లో ప్రచురితమైన వార్త తమకు నచ్చలేదనే కారణంతో.. పత్రికా స్వేచ్ఛను కాలరాస్తూ అక్రమ కేసులు పెట్టడం భావ్యం కాదన్నారు. ‘సాక్షి’ ఎడిటర్‌ ఆర్‌.ధనంజయరెడ్డిపై కేసు నమోదు చేయడాన్ని నిరశిస్తూ చిత్తూరులో ఆంధ్రప్రదేశ్‌ యూనియన్‌ ఆఫ్‌ వర్కింగ్‌ జర్నలిస్ట్స్‌ (ఏపీయూడబ్ల్యూజే), చిత్తూరు ప్రెస్‌క్లబ్‌ సంయుక్త ఆధ్వర్యంలో మంగళవారం చిత్తూరులో పాత్రికేయులు నిరసన వ్యక్తం చేశారు. ఏపీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు ఎం.లోకనాథన్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో పలువురు డీఎస్పీలకు పదోన్నతులు రావాల్సి ఉండగా, ఆలస్యం చేయడం వెనుక అక్రమాలు జరిగాయనే కోణంలో ‘సాక్షి’ పత్రికలో వార్త ప్రచురితమైందన్నారు. ఈ వార్తలో ఏదైనా అభ్యంతరకరమైన విషయం ఉంటే అధికారులు ఖండించాల్సిం ఉందన్నారు. అలా కాదని ‘సాక్షి’ ఎడిటర్‌ ధనంజయరెడ్డిపై కేసు నమోదు చేయడం పత్రిక స్వేచ్ఛకు సంకెళ్లు వేయడమేనన్నారు. దీనిపై దేశ అత్యున్నత న్యాయస్థానం ఇప్పటికే పలు కేసుల్లో స్పష్టత కూడా ఇచ్చిందన్నారు. భావ వ్యక్తీకరణను తెలియచేసే పత్రికల నిర్వాహకులపై కేసులు పెట్టడం సమాజానికి మంచిది కాదన్నారు. చిత్తూరు ప్రెస్‌క్లబ్‌ కార్యదర్శి వై.కాలేశ్వరరరెడ్డి, ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కౌన్సిల్‌ సభ్యులు కెఎం.అశోక్‌కుమార్‌ మాట్లాడుతూ నిజాలు రాసే జర్నలిస్టులపై అక్రమ కేసులు పెట్టడం, అరెస్టులు చేయడం మంచి పద్ధతి కాదన్నారు. ప్రభుత్వానికి, అధికారులకు, ప్రజలకు మధ్య పాత్రికేయులు వారధిలా పనిచేస్తున్నారన్నారు. నిజాలను పత్రికల ద్వారా ఎత్తి చూపినపుడు వాటిని సరిదిద్దుకోవాల్సిందిపోయి.. తప్పుడు కేసులు పెట్టడం తగదన్నారు. ‘సాక్షి’ ఎడిటర్‌పై నమోదు చేసిన అక్రమ కేసును ఎత్తివేయాలని చిత్తూరు వన్‌టౌన్‌ సీఐ మహేశ్వరకు వినతిపత్రం అందజేశారు. ఈ నిరసన కార్యక్రమంలో చిత్తూరు ప్రెస్‌క్లబ్‌ ఉపాధ్యక్షుడు శివప్రసాద్‌, కార్యవర్గ సభ్యులు బాలసుందరం, చంద్రశేఖర్‌, ఏపీయూడబ్ల్యూజే సభ్యులు సురేష్‌, చంద్రప్రకాష్‌, హరీష్‌, శ్రీనివాసులు, చిరంజీవి, ప్రవీణ్‌సాయి, జయకుమార్‌ పాల్గొన్నారు.

‘సాక్షి’ ఎడిటర్‌పై కేసు అప్రజాస్వామికం!
1
1/1

‘సాక్షి’ ఎడిటర్‌పై కేసు అప్రజాస్వామికం!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement