● వైఎస్‌ఆర్‌సీపీ సానుభూతిపరులనిర్భంధం ● ప్రభుత్వ నిధులతో వేసిన దారి అడ్డగింత ● రాకపోకలు లేకుండా ఇనుప కంచె ఏర్పాటు
సాక్షి టాస్క్‌ఫోర్స్ : కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పల్లెల్లో రాజకీయ కక్షలు అంతకంతకు పెరుగుతున్నాయి.. నిన్న మొన్నటి వరకు భౌతిక దాడులకు తెగబడిన పచ్చమూకలు నేడు గృహ నిర్భందాలకు పాల్పడుతున్నాయి. కూటమి పార్టీలకు చెందిన వారు వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులను గృహ నిర్బంధం చేసి పైశాచిక ఆనందాన్ని పొందుతున్నారు. పంచాయతీ నిధులతో గ్రామంలో వేసిన దారికి అడ్డుగా ఇనుప కంచెలను ఏర్పాటుచేసి రాకపోకలు లేకుండా చేస్తున్నారు. దీనిపై అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా పట్టించుకోకపోవడంతో గత రెండు రోజులుగా ఓ కుటుంబం ఇంటి నుంచి బయటకు రాలేక తల్లడిల్లుతోంది. ఎర్రావారిపాళెం మండలం కమలయ్యగారిపల్లి పంచాయతీ బడగనపల్లి గ్రామంలో నివాసముంటున్న వెంకటరమణ, విజయలక్ష్మి దంపతులకు ఇద్దరు పిల్లలు. కుమారుడు భువనసాయి, కుమార్తె మనీషాతో కలసి అదే గ్రామంలో నివాసముంటున్నారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి సానుభూతిపరులుగా ఉంటున్న వెంకటరమణ కుటుంబంపై వారికి సమీప బంధువులైన చరణ్‌కుమార్, మంజుల, రాజేశ్వరమ్మ (జనసేన పార్టీకి చెందిన వారు) కక్ష కట్టారు. వెంకటరమణ పట్టా భూముల్లో చరణ్‌కుమార్ భూములకు వెళ్లడానికి దారి ఏర్పాటుకు ప్రయత్నించారు. తన పట్టా భూముల్లో దారి వేయడానికి వెంకటరమణ అంగీకరించలేదు. దీంతో గ్రామంలోని అతని ఇంటికి రాకపోకలు లేకుండా పంచాయతీ నిధులతో నిర్మించిన సిమెంటు రోడ్డుపై ఇనుప కంచె ఏర్పాటు చేశారు. అంతేకాక వైఎస్‌ఆర్‌సీపీ సానుభూతిపరులైన వెంకటరమణ కుటుంబంపై కక్ష తీర్చుకోవడానికి ఇదే అదనుగా భావించిన గ్రామంలోని కొంతమంది టీడీపీ వర్గీయులు సైతం చరణ్‌కుమార్ కుటుంబీకులకు అండగా నిలిచారు. దీంతో వెంకటరమణ కుటుంబీకులు గత రెండు రోజులుగా ఇంటి నుంచి బయటకు రాలేక అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. పిల్లలు కాలేజీలకు వెళ్లాలన్నా, కనీసం పశువులకు వైద్యం చేయించుకోవాలన్నా దారి లేకపోవడంతో సాయం కోసం ఎదురుచూస్తున్నారు. ఈ విషయాన్ని మండలస్థాయి అధికారులకు తెలియపరచినప్పటికీ వారు స్పందించకపోవడంతో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జిల్లా ఉన్నతాధికారులు, పోలీసులు స్పందించి ఆ కుటుంబానికి బయటకు వచ్చే అవకాశం కల్పించాలని గ్రామస్తులు కోరుతున్నారు.
బడగనపల్లిలో కూటమి నేతల దాష్టీకం..!