భానూ నోరు అదుపులో పెట్టుకో! | - | Sakshi
Sakshi News home page

భానూ నోరు అదుపులో పెట్టుకో!

Jul 18 2025 5:34 AM | Updated on Jul 18 2025 5:34 AM

భానూ నోరు అదుపులో పెట్టుకో!

భానూ నోరు అదుపులో పెట్టుకో!

● నగరి ఎమ్మెల్యే భానుప్రకాష్‌కు మాజీ మంత్రి రోజా స్ట్రాంగ్‌ వార్నింగ్‌ ● వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లపై తప్పుడు కేసుల బనాయింపుపై మండిపాటు

పుత్తూరు: ‘భాను నోరు అదుపులో పెట్టుకో.. తప్పుడు కూతలు కూస్తే తోలు తీస్తా’ అంటూ మాజీ మంత్రి ఆర్కేరోజా నగరి ఎమ్మెల్యే భానుప్రకాష్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమ ఇసుక కేసులో నగరిలో పట్టుబడిన టీడీపీకి చెందిన వారిని వదిలి రాత్రికి రాత్రి వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లపై అక్రమ కేసులు బనాయించడం ఏమిటని ప్రశ్నించారు. నగరి కౌన్సిలర్లు బీడీభాస్కర్‌, బిలాల్‌ను బుధవారం అర్ధరాత్రి అక్రమంగా అరెస్ట్‌ చేసిన నగరి పోలీసులు, గురువారం పుత్తూరు కోర్టులో హాజరుపరిచారు. కోర్టు వీరికి 14 రోజులు రిమాండ్‌ విధించడంతో సత్యవేడు సబ్‌జైలుకు తరలించారు. విషయం తెలుసుకొని పుత్తూరు కోర్టు వద్దకు వచ్చిన మాజీ మంత్రి మీడియాతో మాట్లాడారు. నగరిలో ఇసుక అక్రమ రవాణా కేసులో పట్టుబడిన వారందరూ టీడీపీకి చెందిన వారని తెలిపారు. నగరి ఎమ్మెల్యే భానుకు ముఖ్య అనుచరుడైన భరత్‌ సైతం అరెస్టయిన వారిలో ఉన్నాడని ఆమె పేర్కొన్నారు.

అది సాధ్యపడేనా?

రాజంపేట నుంచి తిరుపతి మీదుగా నగరికి వచ్చిన టిప్పర్లు ఇక్కడ ఇసుకను డంపింగ్‌ చేసుకొని తమిళనాడుకు తరలించాలంటే అది వైఎస్సార్‌సీపీకి చెందిన కౌన్సిలర్ల వల్ల జరిగే పనేనా అని మాజీ మంత్రి ప్రశ్నించారు. రాజంపేట, తిరుపతి, నగరిలో కూటమి ఎమ్మెల్యేలు ఉండగా మూడు జిల్లాలకు చెందిన ఎస్పీలు, కలెక్టర్లను, మైనింగ్‌ ఆఫీసర్లను మేనేజ్‌ చేయడం వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లకు సాధ్యపడే పనేనా అంటూ ప్రశ్నించారు. ఎక్కడో లెక్కల్లో తేడా వచ్చి టిప్పర్లు పట్టుబడడం జరిగిందన్నారు. లెక్కలు సరిచేసుకొని మళ్లీ ఇప్పుడు వైఎస్సార్‌సీపీ నాయకులపై కేసులు పెట్టారని ఆరోపించారు. ఇది ఎంతవరకు న్యాయమని ఆమె ప్రశ్నించారు.

వారు మాఫియాకు అధిపతులు

ఇసుక, గ్రానైట్‌, బియ్యం మాఫియాకు నగరి, గంగాధరనెల్లూరు ఎమ్మెల్యేలు అధిపతులుగా వ్యవహరిస్తున్నారని పత్రికలు, సోషల్‌ మీడియా కోడై కూస్తోందని మాజీ మంత్రి ఆరోపించారు. తమ తప్పులను కప్పిపుచ్చుకోవడానికి రెడ్‌బుక్‌ రాజ్యాంగం ప్రకారం వైఎస్సార్‌సీపీ నాయకులపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు. నగరిలో గాలివాటంతో గెలిచిన గాలి భానుప్రకాష్‌ ఇప్పటి వరకు ఒక్క అభివృద్ధి పని చేయలేదని దుయ్యబట్టారు. ఇటీవల నగరిలోనే తమిళనాడుకు అక్రమంగా తరలిస్తున్న 13 టన్నుల రేషన్‌ బియ్యాన్ని ఇక్కడి అధికారులే పట్టుకొన్నారని గుర్తుచేశారు. ఈ కేసులో అరెస్టయిన ప్రధాన సూత్రధారి అమృతరాజ్‌ నాడార్‌ ఎమ్మెల్యే భానుకు ప్రధాన అనుచరుడని తెలిపారు. భాను నుంచి ఫోన్‌ రావడంతో చిన్నపాటి కేసుతో వెంటనే విడుదల చేసేశారన్నారు. ఇందుకు సాక్ష్యంగా ఇటీవల అమృతరాజ్‌ నాడార్‌ ఎమ్మెల్యే భాను బర్త్‌డేకి ఓ పత్రికలో ఇచ్చిన ప్రధాన అడ్వర్‌టైజ్‌మెంట్‌ను చూపించారు.

ఇకపై ఉపేక్షించేది లేదు!

ఎమ్మెల్యే భానుకు రోజురోజుకు నోరు పెరిగిపోతోందని, ఇటీవల తనపట్ల తప్పుగా మాట్లాడిన విషయాలపై కేసు పెట్టడంతో పాటు డిఫరమేషన్‌ సూట్‌ వేస్తున్నట్లు చెప్పారు. ఇక ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. తన గురించి మాట్లాడడానికి భానుకు అర్హతే లేదన్నారు. రానున్నది జగనన్న ప్రభుత్వమేనని, భాను తినే ప్రతి అవినీతి పైసా కక్కిస్తానని హెచ్చరించారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ప్రజలకు మంచి చేసిందని తెలిపారు. నేటి కూటమి ప్రభుత్వంలో ఒక్క ఏడాదిలోనే రూ.1.86 లక్షల కోట్ల అప్పుతీసుకొచ్చి చెత్త రికార్డు నెలకొల్పిన ఘనత చంద్రబాబునాయుడుకు దక్కిందన్నారు. నగరి నియోజకవర్గంలోని అన్ని మండలాలకు చెందిన ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement