
ఆడబిడ్డకు అన్యాయంపై ఏకమయ్యారు!
● అదనపు కట్నం వేధింపులు ● పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించిన మహిళ
తిరుపతి రూరల్ : అత్తింటి వేధింపులు తాళలేక ఓ మహిళ తన తల్లితో కలసి ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా గ్రామస్తులు అడ్డుకున్నారు. దీంతో గ్రామంలోని మహిళలు అందరూ ఆమెకు అండగా నిలబడ్డారు. బాధితురాలి సమాచారం మేరకు వివరాలు ... తిరుపతి రూరల్ మండలం దుర్గసముద్రం హరిజన వాడకు చెందిన రవి, వనజాక్షి కుమారుడు వెంకటేష్‌కు పెనుమూరుకు చెందిన శారద కుమార్తె త్రిషతో 2021లో వివాహం జరిగింది. వీరికి ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉన్నారు. అయితే మూడు, నాలుగు నెలలుగా వెంకటేష్ రెండో పెళ్లి చేసుకుంటానని, అదనపు కట్నం తేవాలని వేధింపులకు గురిచేస్తున్నాడు. వివాహ సమయంలో 25 సవర్ల బంగారం, డబ్బుతో పాటు ద్వి చక్రవాహనాన్ని కట్నం కింద ఇచ్చినప్పటికీ అదనపు కట్నం కోసం వేధింపులు మొదలు పెట్టారు. ఈ క్రమంలో మూడు నెలల కిందట కూడా తన పుట్టింటి నుంచి లక్ష రూపాయలు తెచ్చి ఇచ్చినప్పటికీ తనను ఇంటిలోకి రానీయకుండా తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని బాధితురాలు త్రిష కన్నీటి పర్యంతమయింది.
తాళం వేసి వెళ్లిపోయారు..
ఇటీవల త్రిష తన తండ్రికి ఆరోగ్యం సరిలేదని పుట్టింటికి వెళ్లి వారం రోజుల తరువాత అత్తింటికి తిరిగి రావడంతో అత్తింటి కుటుంబ సభ్యులు ఇంటికి తాళం వేసుకుని మరో చోటుకి వెళ్లిపోయారు. దీంతో తిరుపతి రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు దుర్గసముద్రంలోని భర్త వెంకటేష్ ఇంటికి వచ్చి తాళం పగులగొట్టి అందులోనే నివాసం ఉండాలని సూచించి వెళ్లారు. అయితే అప్పటి నుంచి అత్తింటి వారు మరింత ఎక్కువగా వేధింపులకు గురి చేస్తూ భర్త వెంకటేష్ చేరదీయకుండా వదిలేశారని బాధిత మహిళ ఆవేదన వ్యక్తం చేస్తోంది. న్యాయం చేయాలంటూ బాధితురాలు త్రిష, తన తల్లి శారదతో కలసి పోలీసు వాహనం ముందు బైఠాయించారు. గ్రామస్తులు ఆమెకు మద్దతుగా నిలబడటంతో పోలీసులు బాధితురాలు త్రిషకు నచ్చజెప్పి ఆత్మహత్య యత్నాన్ని అడ్డుకొని వారించారు. అనంతరం పోలీస్ స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేయాలని సూచించడంతో గ్రామంలో పరిస్థితి సద్దుమణిగింది.