
హాస్టళ్లలో అడ్మిషన్లకు అవకాశం
● మరో 1616 సీట్లు ఖాళీలు ● ఆగస్టు 5వ తేదీ వరకు గడువు
తిరుపతి అర్బన్ : జిల్లాలోని సాంఘిక సంక్షేమ హాస్టల్స్ (ఎస్సీ హాస్టల్స్)లో విద్యార్థులను చేర్చుకోవడానికి వచ్చేనెల 5 వరకు అవకాశం ఉందని ఎస్సీ వెల్ఫేర్ జిల్లా అధికారి విక్రమ్‌కుమార్‌రెడ్డి వెల్లడించారు. శుక్రవారం ఆయన కలెక్టరేట్‌లోని తమ కార్యాలయం నుంచి మాట్లాడుతూ.. జిల్లాలో 60 ఎస్సీ హాస్టల్స్ ఉన్నాయని చెప్పారు. వీటిలో 5 నుంచి పీజీ వరకు చదువుతున్న విద్యార్థులను చేర్చుకోవడానికి అవకాశం ఉందని చెప్పారు. అయితే 6600 మందిని చేర్చుకోవడానికి వీలుందని వెల్లడించారు. అయితే ఇప్పటి వరకు పాత విద్యార్థులు 3640 మంది, కొత్త విద్యార్థులు 1344 మంది చేరారని చెప్పారు. మొత్తంగా 4984 మంది విద్యార్థులు మాత్రమే ఉన్నారని వివరించారు. మరో 1616 సీట్లు ఖాళీగా ఉన్నాయన్నారు. ఆసక్తి ఉన్నవారు విద్యార్థులకు అనుకూలంగా ఉన్న హాస్టల్స్‌లో చేరడానికి వీలుందని స్పష్టం చేశారు. పేద విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మరోవైపు హాస్టల్స్ మరమ్మతులు, అభివృద్ధికి సంబంధించి ప్రభుత్వం జిల్లాలోని ఎస్సీ హాస్టల్స్‌కు రూ.8 కోట్లు, జిల్లా కలెక్టర్ నిధి నుంచి మంజూరు చేశారని చెప్పారు.