
బది‘లీలలు’.. సర్వేయర్లకు కష్టాలు
● జిల్లాలోని 34 మంది సర్వేయర్లు చిత్తూరు జిల్లాకు బదిలీ ● జిల్లాలో ఖాళీ లేకపోవడంతోనే చిత్తూరుకు పంపినట్లు వెల్లడి ● జిల్లాలో 117 సర్వేయర్ పోస్టులు ఖాళీ ● ప్రభుత్వ తీరుపై మండిపడుతున్న సర్వేయర్లు
తిరుపతి అర్బన్: సచివాలయ ఉద్యోగుల బదిలీల విషయంలో నిబంధనలు పాటించకుండా ఇష్టారాజ్యంగా అధికారులు వ్యవహరించారనే విమర్శలు గట్టిగానే వినిపిస్తున్నాయి. తమకు అన్యాయం జరిగిందంటూ సచివాలయంలోని వివిధ విభాగాలకు చెందిన ఉద్యోగులు నెల రోజులుగా గగ్గోలు పెడుతున్నా పట్టించుకునే దిక్కులేకుండా పోయిందని పలువురు మండిపడుతున్నారు. నిబంధనలకు వ్యతిరేకంగా కూటమి నేతల సిఫార్సు మేరకు బదిలీలు నిర్వహించినట్లు తెలుస్తోంది. బదిలీల్లో చోటుచేసుకున్న అవకతవకలపై జిల్లా ఉన్నతాధికారులకు మొరపెట్టుకున్నా.. వారు సీరియస్‌గా తీసుకోకపోవడంపై పలువురు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
34 మంది సర్వేయర్లు చిత్తూరు జిల్లాకు బదిలీ
సర్వేయర్ల బదిలీలకు సంబంధించి 34 మంది సచివాలయ సర్వేయర్లను చిత్తూరు జిల్లాకు బదిలీ చేశారు. దీంతో ఆ సర్వేయర్లు గురువారం కలెక్టరేట్‌లోని సర్వే విభాగం జిల్లా అధికారి అరుణ్‌కుమార్‌ను ఒక్కొక్కరుగా కలిసి.. వారి ఆరోగ్య సమస్యలతోపాటు ఇతర సమస్యలను వెల్లడించారు. తమకు జిల్లాలోనే అవకాశం కల్పించాలని కోరారు. అయితే ఆయన మీచ్చువల్ బదిలీలు ఉంటే చూడండి చేద్దామని చెప్పడంతో వారంతా ఆ దిశగా ఆన్వేషణ చేస్తున్నారు. ఎవరైనా తిరుపతి జిల్లాలో పనిచేస్తున్న సర్వేయర్ చిత్తూరు జిల్లాకు వెళ్లడానికి సుముఖంగా ఉంటే.. చిత్తూరు జిల్లాలోని మీ స్థానంలోకి వారిని పంపించి.. వారి స్థానంలోకి అవకాశం కల్పిస్తామని చెప్పడంతో అంతా ఆందోళన చెందుతున్నారు.
జిల్లాలో 117 మంది సర్వేయర్లు కొరత
జిల్లాలోని సచివాలయాల్లో 491 మంది సచివాలయ సర్వేయర్ల ఉద్యోగాలు గతంలో మంజూరు చేశారు. అయితే 386 మంది పోస్టులను మాత్రమే భర్తీ చేశారు. అందులోను 12 మంది సర్వేయర్లుకు మరో విభాగంలో కొత్తగా ఉద్యోగం రావడంతో వెళ్లిపోయారు. దీంతో మొత్తంగా 374 మంది సర్వేయర్లు మాత్రమే పనిచేస్తున్నారు. దీంతో జిల్లాలో 117 మంది సర్వేయర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వాటిని భర్తీ చేయకుండా ఖాళీలు లేవంటూ చిత్తూరు జిల్లాకు 34 మందిని బదిలీ చేశారు. దీంతో వారంతా ఆందోళన చెందుతున్నారు.
మ్యూచువల్ ఉంటే మార్పు చేస్తాం
సర్వేయర్ల బదిలీలకు సంబంధించి తిరుపతి జిల్లా నుంచి చిత్తూరు జిల్లాకు మ్యూచ్చువల్ ఉంటే తప్పకుండా బదిలీ చేస్తాం.. లేదంటే స్పష్టమైన ఆధారాలతో ఆనారోగ్య సమస్యలు ఉంటే మార్పు చేస్తాం. జిల్లాలో గతంలో 491 సచివాలయ సర్వేయర్ పోస్టులు మంజూరు చేశారు. అయితే 391 మంది మాత్రమే గతం నుంచి పనిచేస్తున్నారు. ఆ తర్వాత మరో 12 మంది నుంచి 14 మంది ఇతర ఉద్యోగాలు రావడంతోనే వెళ్లిపోయారు. తిరుపతి జిల్లా కన్నా చిత్తూరు జిల్లాలోనే అధికంగా సర్వేయర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దాంతో చిత్తూరుకు కొందర్ని ఉమ్మడి చిత్తూరు జిల్లాలో నిర్విహంచిన సర్వేయర్ల కౌన్సెలింగ్‌లో పోస్టింగ్ ఇచ్చారు.
–అరుణ్‌కుమార్, జిల్లా సర్వే విభాగం అధికారి