
● కలగానే బాలాజీ రైల్వే డివిజన్ ● ఏళ్ల తరబడి ప్రజల నిరీ
తిరుపతి అన్నమయ్య సర్కిల్ : తిరుపతి కేంద్రంగా బాలాజీ రైల్వే డివిజన్ ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన దాదాపు రెండు దశాబ్దాలుగా ఉంది. విశాఖ కేంద్రంగా రైల్వేజోన్ ప్రకటించడంపై హర్షం వ్యక్తమవుతున్నా మరోవైపు బాలాజీ డివిజన్ అంశం తెరపైకి వచ్చింది. సీమ ప్రజాప్రతినిధుల నుంచి నుంచి కేంద్రానికి ప్రతిపాదనలు సైతం వెళ్లాయి.
అధికారులు సానుకూలమే..
గుంతకల్ డివిజన్ కేంద్రానికి తరచూ సమావేశాలకు వెళ్లి రావాలంటే రైల్వే అధికారులు, కార్మికులకు ప్రయాణం కష్టతంగా మారింది. ఈ క్రమంలో గుంతకల్, గుంటూరు, విజయవాడ నాలుగు డివిజన్లతోపాటు కొత్తగా బాలాజీ డివిజన్ ఏర్పాటు చేసి విశాఖజోన్‌లో కలిపితే సౌకర్యంగా ఉంటుందని రైల్వే నిపుణులు వెల్లడిస్తున్నారు. ఆ దిశగా ఎంపీలు కేంద్ర రైల్వే మంత్రిత్వశాఖపై ఒత్తిడి తీసుకురావాలని రాయలసీమ వాసులు సైతం కోరుతున్నారు.
డివిజన్ ఏర్పాటైతే..
బాలాజీ డివిజన్ ఏర్పాటైతే ఇందులో తిరుపతి–గూడూరు (92.96కిమీ), తిరుపతి–కాట్పాడి (104.39కిమీ), పాకాల–మదనపల్లె (83కిమీ), రేణిగుంట–కడప (125కిమీ)లైను కలిపే అంశాలను ఇదివరకే రైల్వే అధికారులు పరిశీలించారు. నంద్యాల–పెండేకల్లు (102కిమీ)లైను గుంటూరు డివిజన్‌లోకి విలీనం చేయాలని సూచించారు. అలాగే జిల్లా మీదుగా వెలుగొండ అడవుల నుంచి వెళ్లే కృష్ణపట్నం రైల్వేలైన్ కూడా విజయవాడ డివిజన్‌లోకి వెళ్లింది. కొత్త డివిజన్ ఏర్పడితే తిరుపతి రైల్వే కేంద్రం అత్యంత ప్రాధాన్యత సంతరించుకునే అవకాశముంది. బాలాజీ డివిజన్ కేంద్రానికి దగ్గరలోని రేణిగుంట జంక్షన్‌కు ప్రాముఖ్యత ఉంది. విశాఖ జోన్ ఏర్పడుతున్న నేపథ్యంలో గుంతకల్ డివిజన్ నుంచి వేరుచేసి ఉమ్మడి వైఎస్సార్ కడప జిల్లా వరకు బాలాజీ డివిజన్‌గా ఏర్పాటుచేసే ప్రతిపాదనను కూటమి ప్రభుత్వం ముందుకు తీసుకువెళ్లాలని నిపుణులు కోరుతున్నారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని సూచిస్తున్నారు. విశాఖ జోన్ ఏర్పాటు క్రమంలో బాలాజీ డివిజన్ ఏర్పాటు ఆవశ్యకత వివరించాలని స్పష్టం చేస్తున్నారు. దీంతో తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్సార్ కడప జిల్లాలల్లో పరిశ్రమల స్థాపనకు మార్గం మరింత సుగమం అవుతుందని వివరిస్తున్నారు.