
గంగమ్మా.. కాపాడమ్మా!
● గంగమ్మకు సారె సమర్పించిన భూమన అభినయ్‌రెడ్డి
తిరుపతి కల్చరల్: తిరుపతి శ్రీతాతయ్యగుంట గంగమ్మ తల్లికి వైఎసార్‌సీపీ తిరుపతి నియోజకవర్గ సమన్వయకర్త భూమన అభినయ్‌రెడ్డి శుక్రవారం సంప్రదాయబద్ధంగా సారెను సమర్పించారు. ఆలయ మహద్వారం నుంచి పసుపు, కుంకుమ, గాజులు, పట్టు వస్త్రాలతో కూడిన సారెను నెత్తిన పెట్టుకొని ఆలయ ప్రదక్షిణ చేసి అమ్మవారికి సమర్పించారు. అమ్మవారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తిరుపతి గ్రామదేవత గంగమ్మ తల్లి జాతరకు ఎంతో విశిష్టత ఉందన్నారు. సాక్షాత్తు తిరుమల శ్రీవారి చెల్లెలుగా విరాజిల్లుతూ కోరిన వారి కోర్కెలు తీర్చే కల్పవళ్లిగా ఖ్యాతిగడించిందని తెలిపారు. వైఎస్‌ఆర్‌సీపీ నగర అధ్యక్షుడు మల్లం రవిచంద్రారెడ్డి, టౌన్ బ్యాంక్ చైర్మన్ కేతం జయచంద్రారెడ్డి, గంగమ్మ ఆలయ కమిటీ మాజీ చైర్మన్ కట్టా గోపీయాదవ్, నాయకులు శేఖర్‌రాయల్, తొండమనాటి వెంకటేశ్వర్‌రెడ్డి, తులసీయాదవ్, నల్లానిబాబు, దినేష్ రాయల్, గీతాయాదవ్, పద్మజ పాల్గొన్నారు.