
సీఎంకు సాదర వీడ్కోలు
రేణిగుంట (శ్రీకాళహస్తి రూరల్): సీఎం చంద్రబాబునాయుడుకు రేణిగుంట విమానాశ్రయంలో సాదర వీడ్కోలు లభించింది. తిరుమల పర్యటన అనంతరం శుక్రవారం మధ్యాహ్నం రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న ఆయనకు విమానాశ్రయంలో టీటీడీ ఈఓ శ్యామలరావు, డీఐజీ షిమోషి బాజ్పాయ్, కలెక్టర్ ఎస్.వెంకటేశ్వర్, ఎస్పీ హర్షవర్ధన్ రాజు, జేసీ శుభం బన్సల్, తిరుపతి, చంద్రగిరి, శ్రీకాళహస్తి, నగరి, సత్యవేడు ఎమ్మెల్యేలు, రేణిగుంట తహసీల్దార్ సురేష్‌బాబు తదితరులు సాదర వీడ్కోలు పలికారు. అనంతరం ఆయన ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు వెళ్లారు.
గాయపడిన వ్యక్తి మృతి
పాకాల: రెండు రోజుల క్రితం కారు, స్కూటరు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో గాయపడిన స్కూటరిస్ట్ స్విమ్స్‌లో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఈనెల 19వ తేదీన నేండ్రగుంట బ్రిడ్జ్ వద్ద జరిగిన ప్రమాదంలో పెనుమూరు మండలం, కత్తిరెడ్డిపల్లి పంచాయతీ, గాగమ్మవారిపల్లి గ్రామానికి చెందిన బీ.భాస్కర్‌నాయుడు(48) గాయపడ్డాడు. శుక్రవారం మధ్యాహ్నం తిరుపతి స్విమ్స్‌లో చికిత్స పొందుతూ భాస్కర్‌నాయుడు మృతి చెందారు. ఏఎస్‌ఐ వెంకట్రామానాయుడు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
శ్రీవారి దర్శనానికి
18 గంటలు
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. క్యూ కాంప్లెక్స్‌లో 31 కంపార్ట్‌మెంట్లు నిండాయి. గురువారం అర్ధరాత్రి వరకు 58,872 మంది స్వామివారిని దర్శించుకోగా 23,523 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.71 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. దర్శన టిక్కెట్లు లేని భక్తులకు 18 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులకు 3 గంటల్లో దర్శనం లభిస్తోంది. ఇదిలా ఉంటే సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి క్యూలైన్‌లో వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. కేటాయించిన సమయాన్ని కంటే ముందు వెళ్లిన భక్తులను క్యూలో అనుమతించరని స్పష్టం చేసింది.