
ఆర్‌ఓ ప్లాంట్‌ను ప్రారంభిస్తున్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
పుంగనూరు: జర్మన్ పెప్పర్ మోషన్ ఎలక్ట్రికల్ బస్సుల కంపెనీ ఏర్పాటు కోసం భూములిచ్చిన రైతులకు ఎట్టి పరిస్థితుల్లో నష్టం జరగనివ్వం అని రాష్ట్ర అటవీ, విద్యుత్ శాఖ మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. ఆయన ఆదివారం పుంగనూరులో విలేకరుల సమావేశంలో మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడుతూ భూములిచ్చిన రైతుల ఇంట్లో అర్హులైన వారు ఎంత మంది ఉంటే అందరికీ ఉద్యోగం, పరిహారం, సంతృప్తిగా అందిస్తామని, ఇందులో ఎలాంటి అనుమానాలకు, అపోహలకు తావులేదని రాష్ట్ర మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. జర్మన్ బస్సుల కంపెనీ ఏర్పాటుకు ముఖ్యమంత్రి వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి అనుమతి ఇవ్వడం ఎంతో అదృష్టమన్నారు. పుంగనూరు వెనుకబడిన ప్రాంతం కావడంతో ముఖ్యమంత్రి బస్సుల పరిశ్రమను పుంగనూరుకు కేటాయించారని తెలిపారు. అనంతపురంలో కార్ల పరిశ్రమతో ఆ ప్రాంతం అన్ని విధాలా అభివృద్ధి చెందిందన్నారు. అదే విధంగా మన ప్రాంతంలో పరిశ్రమల ఏర్పాటుతో ఎంతో అభివృద్ధి జరుగుతుందని స్పష్టం చేశారు. జర్మన్ కంపెనీ వారు త్వరలోనే భూసేకరణకు సంబంధించి నిధులు కలెక్టర్ వద్ద డిపాజిట్ చేయనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమం వేగవంతంగా సాగుతోందన్నారు. పరిశ్రమల ఏర్పాటుతో పుంగనూరు నియోజకవర్గంలో భూముల ధరలు పెరుగుతుందన్నారు. నిరుద్యోగులకు ఉపాధితోపాటు వ్యాపారులకు అన్ని రకాలుగా బస్సుల కంపెనీ ఉపయోగపడుతాయన్నారు. ఇలాంటి పరిశ్రమల ఏర్పాటు సమయంలో ప్రజలందరూ సహకరించి, అభివృద్ధికి అండగా నిలవాలన్నారు. ఈ సమావేశంలో ఎస్‌ఈ కృష్ణారెడ్డి, ఎంపీపీ అక్కిసాని భాస్కర్‌రెడ్డి, పీకేఎం ఉడా చైర్మన్ వెంకటరెడ్డి యాదవ్, వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి బైరెడ్డిపల్లి కృష్ణమూర్తి పాల్గొన్నారు.