
ఉప్పల్(హైదరాబాద్): ప్రేమించిన యువతితో గొడవ జరగడంతో మనస్తాపానికి లోనైన ఓ యువ లాయర్ ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఉప్పల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. మహబూబాబాద్ జిల్లా, తొర్రూర్ టీచర్స్ కాలనీకి చెందిన కల్లూరి సాయినాథ్ (30) ఉప్పల్ సూర్యానగర్ కాలనీలో ఉంటూ రంగారెడ్డి జిల్లా కోర్టులో న్యాయవాదిగా పని చేస్తున్నాడు. అతను ఓ యువతిని ప్రేమిస్తున్నాడు. అయితే సదరు యువతిని కాదని మరొకరికి పెళ్లి చేసుకునేందుకు అంగీకరించడంతో అతడి ప్రియురాలు సాయినాథ్ ఇంటికి వచ్చి గొడవ పడింది.
దీంతో మనస్తాపానికి లోనైన సాయినాథ్ సూర్యానగర్‌లోని స్నేహితుల ఇంటికి వెళ్లాడు. స్నేహితులు డ్యూటీకి వెళ్లడంతో ఇంట్లో ఒంటరిగా ఉన్న సాయినా«థ్ గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సాయంత్రం ఇంటకి వచ్చిన అతడి స్నేహితులు తలుపులు తెరిచి చూడగా సాయినాథ్ అప్పటికే మృతి చెందాడు. వారి సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న ఉప్పల్ పోలీసులు మృత దేహాన్ని స్వా«దీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ అసుపత్రికి తరలించారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
గడ్డి మందు తాగి మరో యువకుడు..
గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన యువకుడు చికిత్స పొందుతూ మృతి చెందిన సంఘటన ఉప్పల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో బుధవారం చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. భద్రాచలం, రామావరం ప్రాంతానికి చెందిన ప్రేమ్ కుమార్(25) డ్రైవర్‌గా పని చేసేవాడు. కుటుంబ కలహాలు, ఆర్థిక ఇబ్బందులతో నేపథ్యంలో మంగళవారం సాయంత్రం గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు అతడిని ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
భారీగా హెరాయిన్ పట్టివేత
మణికొండ: రాజస్థాన్ నుంచి హెరాయిన్ అక్రమ రవాణా చేస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేసిన పోలీసులు అతడి నుంచి భారీగా హెరాయిన్ స్వా«దీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. మణికొండ మున్సిపాలిటీ, వైఎస్సార్ కాలనీలో ఉంటున్న రాజస్థాన్‌కు చెందిన వైష్ణోయ్ చోగారాం బుధవారం నార్సింగిలో తమ రాష్ట్రానికి చెందిన వ్యక్తి నుంచి 650 గ్రాముల హెరాయిన్ కొనుగోలు చేశాడు. దానిని ఇంటికి తీసుకెళుతుండగా సమాచారం అందడంతో దాడి చేసిన ఎస్‌ఓటీ పోలీసులు సరుకు స్వా«దీనం చేసుకున్నారు. నిందితుడిని నార్సింగి పోలీసులకు అప్పగించారు. పట్టుబడిన హెరాయిన్ విలువ రూ.1.5 కోట్లు ఉంటుందనిపోలీసులు తెలిపారు.