చనాకా–కొరటకు వన్యప్రాణి సంరక్షణ అనుమతి

Wildlife Conservation Give Permit To Chanaka Korata Project Construction In Adilabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో పెనుగంగ నదిపై మహారాష్ట్ర, తెలంగాణ సాగు, తాగునీటి అవసరాలు తీర్చేలా చేపట్టిన చనాకా–కొరట బ్యారేజీ నిర్మాణానికి కేంద్ర పర్యావరణ మంత్రిత్వశాఖ పరిధిలోని వన్యప్రాణి సంరక్షణ బోర్డు స్టాండింగ్‌ కమిటీ శుక్రవారం అనుమతినిచ్చింది. ప్రాజెక్టు పర్యావరణ అనుమతుల్లో భాగంగా గతనెల 24న ప్రాజెక్టుపై పర్యావరణ శాఖమంత్రి ఆధ్వర్యంలోని స్టాండింగ్‌ కమిటీ ఈ ప్రాజెక్టు అనుమతులపై చర్చించింది. 0.80 టీఎంసీ సామర్థ్యంతో రూ.368 కోట్లతో బ్యారేజీ చేపట్టారు. 13,500 ఎకరాల ఆయకట్టు తెలంగాణలో, మరో 3 వేల ఎకరాల ఆయకట్టు మహారాష్ట్రలో దీనిద్వారా సాగు జరగనుంది.

ఈ ప్రాజెక్టు నిర్మాణం మహారాష్ట్రలోని తాపేశ్వర్‌ వన్యప్రాణి సంరక్షణ కేంద్రానికి దగ్గరగా ఉంది. దీనికి ఎకో సెన్సిటివ్‌ జోన్‌ పరిధిలో 213.48 హెక్టార్ల అటవేతర (నాన్‌ ఫారెస్ట్‌) భూమి అవసరం కానుండగా, మరో 5 వేల హెక్టార్ల అటవేతర భూమి రెండు రాష్ట్రాల్లోని బ్యారేజీ నిర్మాణం, ముంపు ప్రాంతంలోకి వస్తుంది. దీని పర్యావరణ అనుమతుల కోసం ప్రభుత్వం కమిటీకి పంపగా, అటవీ భూముల్లో ఎలాంటి నిర్మాణాలు జర గడం లేదని, ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతం వన్యప్రాణి సంరక్షణ కేంద్రానికి దూరంగా ఉందని అభిప్రాయం వ్యక్తం చేస్తూ అనుమతులు జారీచేసింది. అయితే సంరక్షణ కేంద్రానికి చుట్టు పక్కల పెద్ద శబ్దాలొచ్చే యంత్రాలను వాడరాదని, కెనాల్‌ పనుల నిమిత్తం ఉండే కార్మికుల క్యాంపులు సంరక్షణ కేంద్రానికి దూరంగా ఉండాలని, అటవీ శాఖకు కెనాల్‌ నీటిని పూర్తి ఉచితంగా అందించాలని షరతులు విధించింది.   

చదవండి: Sitarama project: ముంపు సంగతేంటి...?

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top