15 నుంచి థియేటర్లను ప్రారంభిస్తాం 

We Will Open Theaters From 15/10/2020 In Telangana Says Theaters Management - Sakshi

రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అనుమతులివ్వాలి 

తెలంగాణ థియేటర్‌ యజమానుల సంఘం వినతి 

చిక్కడపల్లి (హైదరాబాద్‌): కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా ఈనెల 15 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సినిమా థియేటర్లను తిరిగి ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నా మని తెలంగాణ థియేటర్ల యజమానుల సంఘం పేర్కొంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం తరఫునుంచి అనుమతులు లభించాల్సి ఉందని, ఇదే అంశంపై సోమవారం ఎఫ్‌డీసీ చైర్మన్, మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, సీఎం కేసీఆర్‌లను కలసి వినతిపత్రాలను అందజేయనున్నట్లు తెలిపింది. ఆర్టీసీక్రాస్‌రోడ్డు లోని సుదర్శన్‌ 35 ఎంఎం థియేటర్‌లో తెలంగాణ థియేటర్ల యజమానుల సంఘం శని వారం ఏర్పాటు చేసిన మీడియా ప్రతినిధుల సమావేశంలో ఆ సంఘం కార్యదర్శి విజయేందర్‌రెడ్డి, సంయుక్త కార్యదర్శి రాజ్‌గోపాల్‌ తాండ్ల మాట్లాడుతూ.. నష్టాల్లో ఉన్న తమకు కొన్ని వెసులుబాట్లు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు.

థియేటర్లు మూసివేసి ఉన్న నెలలకు ఫిక్స్‌ కరెంట్‌ ఛార్జీలను, ప్రాపర్టీ ట్యాక్స్‌లను తొలగించాలని కోరారు. భౌతిక దూరం పాటించడంలో భాగంగా థియేటర్లలో ఆల్టర్నేట్‌ సీట్లను ఏర్పాటు చేశామన్నారు. టికెట్‌ కౌంటర్ల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేశామని వివరించారు. హ్యాండ్‌ శానిటైజర్‌లు ఏర్పాటు చేస్తున్నామని, పాత టికెట్‌ ధరలనే కొనసాగిస్తామని స్పష్టం చేశారు. పార్కింగ్‌ చార్జీలను మళ్లీ కొనసాగించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ సమావేశంలో సంఘం ప్రతినిధులు కె.సురేశ్, బాదం వెంకటకృష్ణ, గోపాల్‌రెడ్డి, సంధ్యా థియేటర్‌ మేనేజర్‌ మధుసూదన్, సుదర్శన్‌ థియేటర్‌ మేనేజర్‌ శ్రీనివాస్‌రెడ్డి, దేవి థియేటర్‌ మేనేజర్‌ కుమార్‌ తదితరులు  పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top