
జూలూరుపాడు: వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్ స్వగ్రామం ఉమ్మడి ఖమ్మం జిల్లా జూలూరుపాడు మండలం పాపకొల్లు రెవెన్యూ పరిధిలోని భోజ్యాతండా గ్రామ పంచాయతీ వెనుకతండా గ్రామస్తులు సోమవారం రోడ్డెక్కారు. నీళ్ల కోసం ఖాళీ బిందెలు, బకెట్లతో నిరసన తెలిపారు. భోజ్యాతండా గ్రామ పంచాయతీ వెనకతండా గ్రామంలో రెండు వారాలుగా తాగునీటి సరఫరా నిలిచిపోవడంతో గ్రామస్తులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. దీంతో ఖాళీ బిందెలతో రోడ్డుపై ఆందోళన నిర్వహించారు. రెండు వారాల నుంచి మిషన్ భగీరథ నీళ్లు రావడం లేదని, ఈ విషయాన్ని సర్పంచ్, ఎంపీపీ దృష్టికి తీసుకెళ్లినా పరిష్కారం కాలేదన్నారు. సమస్యను వైరా ఎమ్మెల్యే రాములునాయక్‌కు వివరించినా ఫలితం లేకుండాపోయిందని వాపోయారు. గ్రామంలో చేతి పంపులు కూడా పని చేయడంలేదని, బిందె నీళ్ల కోసం అష్టకష్టాలు పడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. (చదవండి: హుజురాబాద్‌లో టీఆర్‌ఎస్ ఓటమని సర్వేల్లో తేలింది)
చదవండి: మంత్రి పదవి కోసం నేను పెదవులు మూసుకోలేదు: ఈటల