అప్పులుంటే.. చంపేస్తావా! | Wanaparthy Tragedy Debt Pressure Suspected in Family Death Case | Sakshi
Sakshi News home page

అప్పులుంటే.. చంపేస్తావా!

May 28 2026 7:26 AM | Updated on May 28 2026 12:22 PM

Wanaparthy Tragedy Debt Pressure Suspected in Family Death Case

తెలిసీ తెలియని వయస్సులో ఈ చేతులే కదా మాకు గోరు ముద్దలు తినిపించాయి.. ఈ చేతులే కదా మమ్మల్ని ఆడించాయి.. ఈ చేతులే కదా మాకు నడక నేర్పించాయి.. అలాంటి ఈ చేతులతోనే మమ్మల్ని కాటికి సాగనంపుతున్నావా నాన్న అంటూ ఆ చిన్నారుల మూగరోదన ఆ   తండ్రికి వినిపించలేదు.. 

అల్లారు ముద్దుగా పెంచి.. అడిగినవన్నీ అరచేతిలో పెట్టి.. మమ్మల్ని ప్రయోజకులుగా తీర్చిదిద్దాల్సిన నువ్వే.. ఏమాత్రం కనికరం లేకుండా.. కాళ్లు, చేతులు కట్టేసి.. కాటికి సాగే నంపే తరుణంలో నీ గుండె ఎంత బండలా మారింది నాన్నా.. అన్న ఆ పసిహృదయాల మౌనవేదన ఆ తండ్రికి కనిపించలేదు. 

..కేవలం తాను చేసిన అప్పులకు తన భార్యాపిల్లలు ఎక్కడ బలవుతారో అన్న చిన్న కారణంతో.. ఎన్నో విజయాలు అందుకొని.. నిండు నూరేళ్లు జీవించాల్సిన మూడు నిండు ప్రాణాలను బలితీసుకున్నాడు ఓ తండ్రి. ఇంటి నిర్మాణం, వ్యవసాయంలో నష్టాలు.. వెరసీ అప్పులపాలైన ఓ కౌలు రైతు.. తన కుటుంబాన్ని తానే చిదిమేసుకు న్న విషాదకర సంఘటన తీవ్రంగా కలచివేసింది. 

వనపర్తి: జీవనోపాధి కోసం మామిడితోటలు లీజుకు తీసుకుని మామిడి పండ్లు విక్రయిస్తూ.. మిగతా సమయంలో తోటల సంరక్షణ చేసుకుంటూ జీవించే ఓ కుటుంబం సరైన లాభాలు లేక.. చేసిన అప్పులకు వడ్డీలు కట్టలేక.. అప్పులు ఇచ్చిన వారి ఒత్తిళ్లు తట్టుకోలేక ఓ కుటుంబ పెద్ద తన భార్య, ఇద్దరు పిల్లలను నీటిలో సంపులో పడేసి ప్రాణాలు తీసి.. తానూ ఉరేసుకున్న ఉదంతం ఉమ్మడి పాలమూరు జిలాల్లో తీవ్ర కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. మహబూబ్‌నగర్‌ జిల్లా దేవరకద్ర మండలంలోని డోకూరు గ్రామానికి చెందిన నర్సింహులు(40) నాలుగేళ్ల క్రితం ఖిల్లాఘనపురం మండలం సల్కెలాపురం శివారులో సుమారు 50 ఎకరాల మామిడి తోటను లీజు తీసుకుని కుటుంబ సభ్యులతో కలిసి అక్కడే ఉంటూ జీవనం సాగిస్తున్నాడు.

ఈ క్రమంలో తోటల లీజు, ఇతర అవసరాల కోసం గద్వాలలో కొందరితో అప్పు చేశాడు. డోకూరులోని తన సొంత ఇంటిపై ఓ ప్రైవేటు ఫైనాన్స్‌ కంపెనీలో రూ.లక్షల్లో అప్పు చేశాడు. ఇటీవల ఈఎంఐలు సక్రమంగా చెల్లించడం లేదని ఫైనాన్స్‌ కంపెనీ ప్రతినిధులు ఇంటి గోడలపై ఈ ఇంటిని అప్పుకింద జప్తు చేయనున్నట్లు రాయడంతో గ్రామంలో తోటివారు, బంధువులు, సన్నిహితుల ఎదుట అవమానంగా భావించాడు. ఐపీ పెట్టే ప్రయత్నం చేశాడు. తన వద్ద ఉన్న వాహనాలు, వస్తువులను అమ్మేసి అప్పులు తీర్చే ప్రయత్నం చేశాడు. అయినా.. వడ్డీలు వసూలు చేసేవారు, ఈఎంఐలు చెల్లించాల్సిన ఫైనాన్స్‌ కంపెనీల నుంచి ఒత్తిడి తగ్గలేదు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆయన కుటుంబ సభ్యులతో సహా ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలోనే భార్య ఎల్లమ్మ(36), కుమారుడు నిహాల్‌(15), కూతురు సాహితీశ్రీ(13)ల కాళ్లు, చేతులు కట్టేసి తోటలోని సంపులోకి తోసి తాను నివాసం ఉండే కంటైనర్‌కు చీరతో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. 

పరిశీలించిన డీఎస్పీ గిరిబాబు 
విషయం తెలుసుకున్న వనపర్తి డీఎస్పీ గిరిబాబు ఖిల్లాఘనపురం మండలం సల్కెలాపురం గ్రామ శివారులోని మామిడి తోటకు వెళ్లి ఘటనా స్థలా న్ని పరిశీలించారు. మృతదేహాలను మహబూబ్‌నగర్‌ ఆస్పత్రికి పోస్టుమార్టం కోసం తరలించి ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.

గొల్లుమన్న కుటుంబం.. 
తల్లిదండ్రుల చాటున నిండునూరేళ్లు జీవించాల్సిన చిన్నారులు.. ఊహించని విధంగా కన్న తండ్రే.. కాలయముడై కాళ్లు చేతులు కట్టేసి నీటి సంపులోకి తోసి ప్రాణాలు తీయడం కలకలం రేపింది. తోటలో ఆడుతూ... పాడుతూ.. సరదాగా తిరిగే చిన్నారులు విగత జీవులుగా పడి ఉండటాన్ని చూసి మామిడి తోట చుట్టుపక్కల రైతులు, కుటుంబ సభ్యులు గొల్లుమన్నారు. మృతదేహాలకు పోస్టుమార్టం అనంతరం నర్సింహులు స్వగ్రామం డోకూరుకు తీసుకెళ్లారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement