సిరిసిల్ల నేతన్నలు అదుర్స్‌: అమెరికా రీసెర్చ్‌ స్కాలర్‌ కైరా ప్రశంసలు

US Research Scholar Kyra Zafp Praises Sirisilla Handloom Skills - Sakshi

సాక్షి, సిరిసిల్ల: అగ్గిపెట్టలో పట్టే చీర నేసి సిరిసిల్ల ఖ్యాతిని ప్రపంచానికి వెలుగెత్తి చాటిన అక్కడి నేతన్నలపై ప్రశంసలు కురిపించారు అమెరికా చేనేత నైపుణ్య నిపుణురాలు, రీసెర్చ్‌ స్కాలర్‌ కైరా జాఫ్‌. నేతన్నల కళానైపుణ్యాలను చూసి అబ్బురపడిపోయారు. అమెరికా ప్రభుత్వ పరిశోధన గ్రాండ్‌తో ఆసియాలోని వివిధ దేశాల్లో చేనేత పరిస్థితులు, నేతన్నల నైపుణ్యం వంటి రంగాలపై సమగ్రమైన ‍అధ్యయనం చేస్తున్న కైరా.. శనివారం సిరిసిల్లలో పర్యటించారు.  సిద్దిపేటలోని సెరికల్చర్ రైతులతో క్షేత్రస్థాయి పర్యటన ముగించుకొని అక్కడి నుంచి సిరిసిల్ల చేరుకున్న ఆమె నేతన్నలతో సమావేశమయ్యారు. చేనేత కార్మికుల మగ్గాలు, వారు నేస్తున్న బట్టలు, చేనేత నైపుణ్యాలకు సంబంధించిన అంశాలపైన వివరాలు అడిగి తెలుసుకున్నారు. చేనేత కళ నుంచి మరమగ్గాలవైపు సిరిసిల్ల నేతన్నలు మళ్ళిన చారిత్రాత్మక క్రమంపైనా ఆమె వివరాలు తీసుకున్నారు. 

తన వినూత్నమైన చేనేత ఉత్పత్తులతో దేశవ్యాప్తంగా ప్రచారంలోకి వచ్చిన హరిప్రసాద్‌ను కలిశారు కైరా జాఫ్‌. ఆయన రూపొందించిన వివిధ చేనేత ఉత్పత్తులు, ముఖ్యంగా అగ్గిపెట్టెలో పట్టేలా నేసిన చీరను చూసి ఆమె అబ్బురపడ్డారు. ఇంత అద్భుతమైన ప్రతిభ నైపుణ్యం కలిగిన చేనేత కార్మికులను ఇంతవరకు తాను చూడలేదని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. సిరిసిల్ల పట్టణంలో ఉన్న చేనేత కార్మికుల నైపుణ్యంతో పాటు పవర్ లూమ్ క్లస్టర్‌గా మారిన తీరు పట్ల హర్షం వ్యక్తం చేశారు. సంక్షోభం నుంచి స్వయం సమృద్ధి వైపు సాగుతుండడంపైన ఆమె ఆసక్తి చూపారు.

కైరా బృందం వెంట తెలంగాణ మర మగ్గాలు, జౌళి అభివృద్థి కార్పొరేషన్‌ అధ్యక్షులు గూడూరి ప్రవీణ్‌, సిరిసిల్ల మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళా చక్రపాణి, స్థానిక టెక్స్‌టైల్‌ అధికారులతో పాటు చేనేత నేత కార్మిక సంఘాల ప్రతినిధులు ఉన్నారు. ఈ సందర్భంగా ఒకప్పుడు సిరిసిల్ల క్లస్టర్‌లో నేతన్నల ఇబ్బందులు,  పరిశ్రమ సంక్షోభం, దాని నుంచి బయటపడిన విధానం, అందుకు ప్రభుత్వం అందించిన సహకారం, కార్మికులు తమ నైపుణ్యాలను, పవర్లూమ్ యంత్రాలను ఆధునికరించిన విధానం వంటి వివరాలను అందజేశారు.

చేనేత కార్మిక క్షేత్రాల్లో పర్యటన..
ఇప్పటికే పలు దేశాల్లో ఉన్న పరిస్థితులు, అక్కడి చేనేత పరిశ్రమపైన ఆమె తన అధ్యయనాన్ని పూర్తిచేసుకుని భారత్‌కు వచ్చారు.  తెలంగాణతో పాటు తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఒడిశా, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో తన అధ్యయనాన్ని కొనసాగించనున్నారు. ఇందులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలోని చేనేత కార్మిక క్షేత్రాలైన పోచంపల్లి, గద్వాల్ సహా ఇతర నేత కార్మిక క్షేత్రాలు ఎన్ఎస్ సిరిసిల్ల సిద్దిపేట జనగామ వంటి ప్రాంతాలలో పర్యటించనున్నారు.

ఇదీ చదవండి: బయోమెట్రిక్‌ పద్ధతిన పింఛన్లు స్వాహా!..లబోదిబోమంటున్న బాధితులు 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top