
వేదికపై నవ్వులు చిందిస్తున్న కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, మంత్రి శ్రీధర్‌బాబు, యోగా గురువు రాందేవ్ బాబా
బొమ్మల నుంచి యుద్ధ ట్యాంకుల వరకు మన దగ్గరే తయారీ
ఆర్థిక వ్యవస్థలో జైన సముదాయ వాటా అసాధారణం
0.5 శాతం ఉన్న జైనుల నుంచి 24 శాతం వాటా వస్తోంది
‘జిటో కనెక్ట్–2025’ మూడు రోజుల సదస్సు ప్రారంభోత్సవంలో కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌సింగ్
సాక్షి, హైదరాబాద్: బొమ్మల నుంచి యుద్ధ ట్యాంకుల వరకు అన్నీ భారత్‌లోనే తయారవుతున్నాయని, మన దేశం ప్రపంచ ఫ్యాక్టరీగా ఎదిగే రోజు ఎంతో దూరంలో లేదని కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ అన్నారు. హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్‌లో శుక్రవారం ప్రారంభమైన ‘జైన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఆర్గనైజేషన్ (జిటో) కనెక్ట్ 2025’మూడు రోజుల సదస్సును కేంద్రమంత్రి కిషన్‌రెడ్డితో కలిసి రాజ్‌నాథ్‌సింగ్ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ భారత ఆర్థిక వ్యవస్థలో జైన సముదాయ వాటా అసాధారణమన్నారు.
దేశ జనాభాలో జైన సముదాయం కేవలం 0.5 శాతం ఉన్నా, మొత్తం పన్ను సేకరణలో వారి సహకారం 24 శాతంగా ఉందని చెప్పారు. కఠిన శ్రమ, సంపన్నతకు ప్రపంచవ్యాప్తంగా జైన సమాజం గుర్తింపు పొందిందని ప్రశంసించారు. జైన సముదాయ తాత్వికత భారతీయ సంస్కృతిలో లోతుగా పాతుకుపోయి ఉందని, దాని చరిత్ర భారతదేశ ఆధ్యాత్మిక, సాంస్కృతిక ప్రయాణంలో అమూల్యమైన పాఠమని పేర్కొన్నారు. ఫార్మా, ఏవియేషన్, విద్యా రంగాల్లో జైన సముదాయం ముందంజలో ఉందని తెలిపారు. ‘పురాతన తీర్థంకరుల నుంచి ఆధునిక కాల నాయకుల వరకు, జైన సిద్ధాంతం భారతదేశ నైతిక, ధార్మిక ఆకృతిని రూపొందించింది. జైన సముదాయ ముద్ర ప్రతిచోటా
విలువలతో కూడిన వృద్ధికి చిరునామా: శ్రీధర్‌బాబు
తెలంగాణ విలువలతో కూడిన వృద్ధికి చిరునామాగా నిలుస్తూ దేశంలోని ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్‌గా మారిందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. పారిశ్రామికాభివృద్ధికి అత్యంత అనుకూలంగా ఉన్న తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని పారిశ్రామికవేత్తలను కోరారు. ఒకప్పుడు పారిశ్రామికవేత్తలు ప్రభుత్వాలిచ్చే రాయితీలు, ప్రోత్సాహకాలను చూసే పెట్టుబడులు పెట్టేవారన్నారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఇప్పుడు వారి ఆలోచన తీరు కూడా మారిందని చెప్పారు.
జైన సమాజం సేవా స్ఫూర్తిని, తెలంగాణలో ఆవిష్కరణల వాతావరణంతో అనుసంధానిస్తే ప్రపంచం కోరుకుంటున్న నైతిక వృద్ధి నమూనా ఆవిష్కృతం అవుతుందని చెప్పారు.రెండేళ్లకో మారు రొటేషన్ ప్రాతిపదికన జరిగే జిటో సదస్సు ఈసారి హైదరాబాద్‌లో జరుగుతుండగా, ప్రపంచ నలుమూలల నుంచి 50 వేలకుపైగా ప్రతినిధులు హాజరవుతారని నిర్వా హకులు తెలిపారు. సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్‌రావు, యోగాగురువు రాందేవ్ బాబా, జిటో హైదరాబాద్ చాప్టర్ ప్రతినిధులు రోహిత్ కొఠారి, లలిత్ చోప్రా, విశాల్ అంచాలియా, జిటో కన్వీనర్ బీఎల్ భండారీ, సుశీల్ తదితరులు పాల్గొన్నారు. కాగా జిటో సదస్సుకు వచ్చిన రాజ్‌నాథ్ సింగ్‌కు బేగంపేట విమానాశ్రయంలో స్వాగతం పలికిన వారిలో రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు, ఎంపీలు ఈటల రాజేందర్, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ఉన్నారు.