
హైదరాబాద్: తెలంగాణ విమోచన దినోత్సవాన్ని కేంద్ర ప్రభుత్వం తెలంగాణలోని సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించింది. ఈ కార్యక్రమానికి కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సైనిక అమరవీరుల స్తూపానికి ఆయన నివాళులర్పించారు. అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించారు. సర్దార్ వల్లభాయ్ పటేల్‌కు నివాళులర్పించారు. ఇదే సందర్భంలో కేంద్ర బలగాల గౌరవ వందనాన్ని కూడా రాజ్‌నాథ్ స్వీకరించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, గజేంద్ర సింగ్ షెకావత్, బండి సంజయ్ కుమార్, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ఎన్.రాంచందర్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కేంద్రమంత్రి బండి సంజయ్ మాట్లాడుతూ ఈ రోజు మూడు ముఖ్యమైన పండుగలు జరుపుకుంటున్న శుభదినమన్నారు. ఈ రోజున మోచన దినోత్సవం, విశ్వకర్మ జయంతి, ప్రధాని మోదీ జన్మదినం జరుపుకుంటున్నామన్నారు. నిజాం నిరంకుశత్వానికి వ్యతిరేకంగా ఎంతో మంది పోరాడి ప్రాణాలు అర్పించారని, తెలంగాణలో ఎన్నో జలియన్ వాలా బాగ్ లు జరిగాయన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ ఈ ప్రాంతానికి విముక్తి కల్పించడంతోనే మనం భారత్ లో ఏకమయ్యామన్నారు. అందుకే సర్దార్ వల్లభాయ్ పటేల్ తెలంగాణ కు స్వేచ్ఛను ఇచ్చిన మహనీయునిగా గుర్తుంచుకోవాలన్నారు. కేంద్ర ప్రభుత్వం విమోచన దినోత్సవ వేడుకలు అధికారికంగా నిర్వహిస్తున్నదని అన్నారు. తెలంగాణ వీరులను రాష్ట్ర ప్రభుత్వం అవమనిస్తున్నదని బండి సంజయ్ ఆరోపించారు.
బీజేపీ నేత, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ చరిత్రను తొక్కి పెట్టాలని ఇక్కడి రాష్ట్ర పాలకులు చూస్తున్నారని ఆరోపించారు. కర్ణాటక, మహారాష్ట్రలో అధికారికంగా ఉత్సవాలు నిర్వహిస్తుండగా, ఇక్కడి ప్రభుత్వానికి ఎం వచ్చిందని నిలదీశారు. హైదరాబాద్ లిబరేషన్ డే జరగకుండా ఉండటానికి కారణం ఎంఐఎం పార్టీ అని, ఎంఐఎం పార్టీకి భయపడి తెలంగాణ చరిత్రను కొందరు వక్రీకరిస్తున్నారని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో బీజేపీ అధికారంలోకి వచ్చాక వాడవాడలా విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తామన్నారు. కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ మాట్లాడుతూ ప్రధాని మోదీ ఆదేశాలతో విమోచన దినోత్సవాన్ని కేంద్రం అధికారికంగా నిర్వహిస్తున్నదన్నారు. ప్రధాని మోదీకి జన్మదిన శుభాకాంక్షలు చెబుతూ, మోదీ నేతృత్వంలో దేశం మరింత పురోగమిస్తున్నదన్నారు.