2026 నాటికి పూర్తి చేస్తాం

UNESCO Report On Restoration Of Ramappa Temple - Sakshi

రామప్ప ఆలయం పునరుద్ధరణపై యునెస్కోకు నివేదిక

ఏఎస్‌ఐ, రాష్ట్ర ప్రభుత్వం, కాకతీయ హెరిటేజ్‌ ట్రస్టు ఆధ్వర్యంలో రిపోర్టు తయారీ 

తాజాగా యునెస్కో అనుబంధ ఐకొమాస్‌కు సమర్పణ 

సాక్షి, హైదరాబాద్‌: ప్రపంచ వారసత్వ కట్టడంగా గుర్తింపు పొందిన ప్రఖ్యాత రామప్ప దేవాలయం చుట్టూ అభివృద్ధి పనులు, పురాతన అనుబంధ దేవాలయాల పునరుద్ధరణ 2026 మార్చి నాటికి పూర్తి చేయనున్నట్లు కేంద్ర పురావస్తు శాఖ యునైటెడ్‌ నేషన్స్‌ ఎడ్యుకేషనల్‌.. సైంటిఫిక్‌ అండ్‌ కల్చరల్‌ ఆర్గనైజేషన్‌ (యునెస్కో)కు స్పష్టం చేసింది. ఈ మేరకు సమగ్ర నివేదికను ఆ సంస్థ అనుబంధ విభాగం ఇంటర్నేషనల్‌ కౌన్సిల్‌ ఆన్‌ మాన్యుమెంట్స్‌ అండ్‌ సైట్స్‌ (ఐకొమాస్‌)కు సమర్పించింది.

ప్రపంచ వారసత్వ కట్టడంగా రామప్పను గతేడాది యునెస్కో గుర్తించిన విషయం తెలిసిందే. యునెస్కో నిబంధనలు, మార్గదర్శకాల ప్రకారం ఆ ప్రాంతాన్ని సమగ్రంగా అభివృద్ధి చేయాలి. అందు కు 8 అంశాలను సూచిస్తూ, వాటి ప్రకారం పనులు ఎలా చేస్తా రో, ఎప్పటిలోగా చేస్తారో డిసెంబర్‌ వరకు నివేదిక అందజేయా లని ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం, కాకతీయ హెరిటేజ్‌ ట్రస్టుతో సంప్రదించి రూపొందించిన నివేదికను తాజా గా ఐకొమాస్‌కు ఏఎస్‌ఐ సమర్పించింది. 

ఏం చేస్తారు..?: రామప్ప ఆలయం పక్కనే అదే సమయంలో నిర్మించిన కామేశ్వరాలయాన్ని పునరుద్ధరించడం కీలకం. 33 మీటర్ల వెడల్పు, 33 మీటర్ల పొడవుతో ఉండే ఈ మహా మండపాన్ని వేయి స్తంభాల మండపం తరహాలో పునరుద్ధరిస్తారు. 2023, జూన్‌ నాటికి ప్రదక్షిణ పథం వరకు, 2026, మార్చి నాటికి కక్షాసనతో పూర్తి పునరుద్ధరణ జరుగుతుందని యునెస్కోకు ఏఎస్‌ఐ తెలిపింది.

3 మీటర్ల లోతు నుంచి సాండ్‌ బాక్స్‌ పరిజ్ఞానంతో పునాదులు నిర్మిస్తారు. 8 శతాబ్దాల కిందట ఈ ఆలయం కట్టినప్పుడు వాడిన ఇసుకనే మళ్లీ వాడనున్నారు. దానిమీద అర మీటరు మందంతో డంగు సున్నం, ఇటుకలతో వేదిక నిర్మించి దానిమీద రాళ్లతో ప్రధాన ఆలయ నిర్మాణాన్ని ప్రారంభించనుండటం విశేషం.  రామప్ప చెరువు వద్దకు వెళ్లే దారిలో శిథిలమైన చిన్న ఆలయాలను, రామప్పకు చేరువలో నర్సాపూర్‌లోని చెన్నకేశవస్వామి, కొత్తూరులోని దేవునిగుట్ట, బుస్సాపూర్‌లోని నరసింహస్వామి ఆలయాలతోపాటు జాకారంలోని శివాలయం, రామానుజాపూర్‌లోని పంచకూటాలయాలను పునరుద్ధరించారు.  

రామప్పకు 25 కి.మీ. పరిధిలో టూరిజానికి మాస్టర్‌ ప్లాన్‌ను సిద్ధం చేస్తారు. పర్యాటకులకు సమస్త వసతులుండాలని యునెస్కో సూచించిన నేపథ్యంలో ఆ వివరాలను ఇందులో పొందుపర్చారు. దీని పరిధిలో ఉండే గ్రామాల అభివృద్ధి ఎలా ఉండాలో నిర్ధారిస్తూ ఓ పట్టణ ప్రణాళికను రూపొందించారు. వ్యవసాయానికి రామప్ప చెరువు నుంచి నీటిని మళ్లించే చానళ్లు, చెరువు కట్ట అభివృద్ధి చేయనున్నట్లు నివేదికలో పేర్కొ న్నారు.

పాలంపేట స్పెషల్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ ఆధ్వర్యంలో పనులు జరుగనున్నాయి. రామప్ప ఆలయ వైభవాన్ని పెంచడం, అక్కడి పవిత్రతను కాపాడటం, పురాతన కట్టడానికి ఏ రకంగానూ నష్టం వాటిల్లకుండా వ్యవహరించడం.. స్థానిక ప్రజలు, వ్యాపారులు, భక్తులు, అర్చకులకు అవగాహన సదస్సులు నిర్వహించడం లాంటివి నివేదికలో పొందురుపర్చారు. అభివృద్ధి పనులకు రాష్ట్ర ప్రభుత్వం పక్షాన రూ.15 కోట్లను ఇటీవలే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మంజూరు చేశారు.  

ఆ నిర్మాణాలతో పోలికలు పంపండి: యునెస్కో  
ఇప్పటికే ప్రపంచ వారసత్వ కట్టడంగా గుర్తింపు పొందిన కట్టడాలతో రామప్పను పోలుస్తూ నివేదిక సమర్పించాలని యునెస్కో కోరింది. నిర్మాణానికి వాడిన రాయి, పునాదిలో వినియోగించిన పరిజ్ఞానం, ఆలయ నగిషీలు, శిల్పకళారీతుల వర్ణన, నాట్యరీతులతో కూడిన శిల్పాలకు సంబంధించి ఖజురహో, హంపి, తంజావూరు బృహదీశ్వరాలయం, పట్టదకల్లు, బాదామీ ఆలయాలతో పోలుస్తూ నివేదికను సమర్పించారు. కంబోడియా, థాయ్‌లాండ్‌ లాంటి దేశాల్లోని ఆలయాలతో పోలుస్తూ వచ్చే డిసెంబర్‌ నాటికి నివేదిక ఇవ్వనున్నట్లు అధికారులు హామీ ఇచ్చారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top